చేజేతులా సైనా ఓటమి హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్ పోరు ముగిసింది. శుక్రవారం ఐదో రోజు మిక్స్‌డ్ డబుల్స్, మహిళల సింగిల్స్‌లో భారత్ పరాజయం పాలైంది. దీంతో హైదరాబాద్‌లో జరుగుతున్న వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత్ పరాజయాల పరంపర సంపూర్ణమైంది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో సైనా నెహ్వాల్ 16-21, 19-21 తేడాతో రెండో సీడ్ వాంగ్ లిన్(చైనా) చేతిలో కంగుతింది. తొలి గేమ్‌లో ఓడినా రెండో గేమ్‌లో సైనా అద్భుతంగా ఆడి లిన్‌కు గట్టి పోటీ ఇచ్చింది. అయితే అనవసర తప్పిదాలతో సైనా ఓటమి కొని తెచ్చుకొంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో గుత్తాజ్వాల-వి.డిజు జోడీ క్వార్టర్ ఫైనల్‌లోనే వెనుదిరిగింది. రెండో సీడ్ ఇండోనేసియా జోడీ నోవా విడియాంటో-లిలియాన నస్టిర్ 21-16, 21-14తో భారత జంటను ఓడించింది.
అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న భారత స్టార్ ఆరో సీడ్ సైనా నెహ్వాల్ చేజేతులా ఓటమి కొని తెచ్చుకుంది. అనవసర తప్పిదాలతో ప్రత్యర్థి కోలుకునేలా చేసి ఫలితాన్ని చవిచూసింది. తొలి గేమ్‌లో చైనా క్రీడాకారిణి ఆధిపత్యాన్ని కనబరిచింది. 7-1తో ముందుకు దూసుకెళుతున్న వాంగ్‌లిన్ ఆధిక్యాన్ని సైనా అడ్డుకుంది. పోటీపడి పాయింట్లు సాధించడంతో పోటీ రసవత్తరంగా సాగింది. అయితే కీలక సమయంలో ఒత్తిడికి లోను కావడంతో మళ్లీ లిన్ కోలుకుంది. అద్భుత షాట్లతో సైనాను ముప్పతిప్పలు పెట్టి గేమ్‌ను దక్కించుకుంది. ఒక దశలో గెలుపుపై ఆశలు చిగురింప చేసిన సైనా వరుస తప్పిదాలతో పరాజయం పాలైంది.
Pages: 1 -2- -3- News Posted: 14 August, 2009
|