పాక్ పైనే ఇండియా ఆశలు సెంచురియన్ : వాతావరణ శాస్త్రజ్ఞుల సూచనలను నిజం చేస్తూ సోమవారం సాయంత్రం సరిగ్గా 5.40 గంటలకు వర్షం కురిసి సెంచురియన్ మైదానంలో ప్రతి ఒక్కరినీ నిరాశకు గురి చేసింది. చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో ఇండియాతో తమ గ్రూప్ 'ఎ' లీగ్ పోటీలో టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 42.3 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసి అంతిమ దాడికి సమాయత్తం అవుతున్న దశలో వర్షం వల్ల ఆటను నిలిపివేయవలసి వచ్చింది.
మ్యాచ్ పూర్తి కానందున ఇండియా, ఆస్ట్రేలియా జట్లకు చెరి ఒక పాయింట్ లభించింది. తత్ఫలితంగా పాకిస్తాన్ గ్రూప్ 'ఎ' నుంచి సెమీ ఫైనల్స్ కు అర్హత పొందిన తొలి జట్టు అయింది. ఇండియా సెమీ ఫైనల్స్ చేరుకోవాలంటే బుధవారం ఆస్ట్రేలియాను పాకిస్తాన్ ఓడించాలి. ఆతరువాత ఇండియా అదే రోజు అత్యంత భారీ నికర రన్ రేట్ తో వెస్టిండీస్ జట్టును ఓడించాలి. ఇండియా రన్ రేట్ ఆస్ట్రేలియా కన్నా మెరుగైనదిగా ఉండాలి.
తన చివరి గేము నుంచి అంటే ఇంతకుముందు పాకిస్తాన్ తో లీగ్ పోటీ నుంచి తన బౌలింగ్ ను కొనసాగించినట్లుగా ఆశిష్ నెహ్రా ఈ మ్యాచ్ లో ఆది నుంచే సరైన లైన్, లెంగ్త్ ను పాటిస్తూ బౌలింగ్ చేయసాగాడు. అతను ఆస్ట్రేలియా ఓపెనర్లు ఇద్దరినీ ముప్పుతిప్పలు పెట్టాడు. అతని ఓవర్ లో ఒక లెంగ్త్ నుంచి పైకి లేచిన బంతి షేన్ వాట్సన్ ను అప్రతిభుడిని చేసింది. వాట్సన్ బంతిని పుల్ చేయబోయి గాలిలోకి కొట్టడంతో హర్భజన్ సింగ్ సునాయాసంగా క్యాచ్ చేశాడు.
ఆస్ట్రేలియన్ ఒడిఐ జట్టులో స్థిరంగా చోటు దక్కంచుకున్న టిమ్ పైన్ ఆతరువాత భారత బౌలింగ్ ను తుత్తునియలు చేయడానికి ఉపక్రమించాడు. 18 నెలల క్రితం ఆస్ట్రేలియాను ముప్పుతిప్పలు పెట్టిన ఇశాంత్ శర్మేనా ఇప్పుడు ఇలా బౌల్ చేస్తున్నాడు అనిపించేలా అతను మరీ షార్ట్ బంతిని వేశాడు. ఆ మరుక్షణం అది స్క్వేర్ లెగ్ మీదుగా సిక్సర్ కు వెళ్ళింది. ఇశాంత్ సరైన లెంగ్త్ ను కొనసాగించకపోవడమే కాకుండా ప్రత్యర్థులకు షాట్లు కొట్టేందుకు పుష్కలంగా అవకాశాలు కూడా ఇచ్చాడు. వర్షంతో ఉపశమనం కలగడానికి ముందు అతను 7.3 ఓవర్లలో ఒక సిక్సర్, ఆరు బౌండరీలు ఇచ్చాడు.
Pages: 1 -2- -3- News Posted: 29 September, 2009
|