5నిమిషాల్లో 100 కోట్లు ఉఫ్!
ముంబై: క్రితం సంవత్సరం (2008లో) నలభై లక్షల కోట్ల రూపాయలకు పైగా నష్టం సంభవించిన తరువాత స్టాక్ మార్కెట్ యథేచ్ఛా పతనం కొనసాగుతూనే ఉన్నది. ప్రస్తుత సంవత్సరం (2009లో) మొదటి రెండు నెలలలో షేర్ల లావాదేవీలలో ప్రతి ఐదు నిమిషాలకు సగటున రూ. 100 కోట్ల మేరకు మదుపరులు నష్టపోయారు. ఈ సంవత్సరం ఇంత వరకు మొత్తం పెట్టుబడిదారుల సంపద దాదాపు రూ. 2.82 లక్షల కోట్ల మేరకు తుడిచిపెట్టుకుపోయింది.
అయితే, 2008లోను, 2009 సంవత్సరంలో తొలి రెండు నెలలలోను స్టాక్ మార్కెట్ లో వాటిల్లిన నష్టాలను విశ్లేషిస్తే ఈ మాంద్యం ప్రభావం 2008తో పోలిస్తే ఈ సంవత్సరం ఇంతవరకు అంత తీవ్రంగా లేదని విదితమవుతోంది.. 2008లో ప్రతి రెండు నిమిషాల లావాదేవీలలో సగటున రూ. 100 కోట్ల మేరకు నష్టాలు వాటిల్లాయి.
2008లో లిస్టయిన అన్ని కంపెనీల సమీకృత మార్కెట్ కాపిటలైజేషన్ పరంగా మొత్తం పెట్టుబడిదారుల సంపద సుమారు రూ. 72 లక్షల కోట్ల నుంచి దాదాపు రూ. 31 లక్షల కోట్లకు పడిపోయింది. లిస్టయిన కంపెనీల ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం, 2009లో ఇంతవరకు భారత స్టాక్ మార్కెట్లలో మదుపరుల సంపద దాదాపు రూ. 28.60 లక్షల కోట్లకు పతనమైంది.
Pages: 1 -2- News Posted: 1 March, 2009
|