చీకటిని ఛేదించిన 'నానో'
ముంబై: నగరం నిద్రిస్తోంది. అర్ధరాత్రి సమయంలో ట్రాఫిక్ సద్దుమణిగింది. విపరీతంగా రద్దీగా ఉండే రోడ్లన్నీ బోసిపోయాయి. అక్కడక్కడా కొందరు పాదచారులు మాత్రమే మగతగా నడుచుకుంటూ వెళుతున్నారు. ఆ సమయంలో ఏడు విభిన్న రంగుల్లోని నానో కార్లు చీకట్లను చీలుస్తూ మెరైన్ డ్రైవ్ లోని పార్శీ జింఖానాకు చేరుకున్నాయి. ఒక్కొక్క నానో కారు ఒక సెక్యూరిటీ గార్డుతో సహా సోమవారంనాడు విడుదల కార్యక్రమం జరిగే పార్శీ జింఖానాకు చేరుకున్నాయి. కార్ల పట్ల ఆసక్తిగల దేశ ప్రజలందరూ నానో విడుదల కోసం ఎదురుచూస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఉత్తరాఖండ్ లోని పంతనగర్ టాటా మోటార్స ఉత్పత్తి యూనిట్ నుండి ఈ కార్లు జింఖానా కు చేరుకున్నాయి. మధ్యలో వాషి అనే చోట మాత్రమే మజిలీ చేశాయి.
తెలుపు, మెటాలిక్ గ్రే, మాటీ గ్రే, ఎరుపు, నీలం, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగుల్లోని ఏడు కార్లు జింఖానాకు చేరుకోగానే ముగ్గురు పోలీసు ఇన్సెక్టర్ల సారధ్యంలో రెండు జీపుల నిండా పోలీసులతోను, ఒక వైర్ లెస్ పెట్రోల్ వ్యాన్ తో కూడిన సెక్యూరిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆహ్వానితులకు మాత్రమే లోపలకు ప్రవేశముంటుంది. ఔత్సాహిక ప్రజానీకం సృష్టించే గందరగోళాన్ని నివారించేందుకు తగిన ఏర్పాట్లను చేపట్టారు. జింఖానా గ్రౌండ్స్ వద్ద ముందుగా రూపొందించిన వరుస క్రమంలో కార్లను ఉంచారు. సిల్క గుడ్డను కార్లపై కప్పి ఉంచారు. ఈ కార్లకు పక్కనే ఒక బ్రహ్మాండమైన బెలూన్ ను ఉంచారు. అధికారులు ఈ బెలూన్ ఎగుర వేసేందుకు అభ్యంతరం చెప్పారు.
రెడ్ కార్పెట్ ను పరవడం, బారికే్డ్లను ఏర్పాటు చేయడం, హెవీ డ్యూటీ స్పీకర్లను పరీక్షించడం లాంటి కార్యక్రమాలతో జింఖానా ఆదివారంనాడు చాలా బిజీగా ఉండింది. ఈ జింఖానా గ్రౌండ్ ను దూరం నుంచి చూసేందుకు వీలున్న ఫ్లైఓవర్ పైకి వెళ్లవలసిందిగా మీడియాకు సెక్యూరిటీ సూచించింది. జింఖానా ఏర్పట్లను సైతం చూసేందుకు సెక్యూరిటీ అనుమతించలేదు. జింఖానా చుట్టూ మూగిన చూపరులను సెక్యూరిటీ దూరంగా నెట్టి వేసింది. సోమవారంనాడు సాయంత్రం 7 గంటలకు జరిగే నానో విడుదల కార్యక్రమానికి వచ్చే వ్యాపార, రాజకీయ ప్రముఖుల విషయం కూడా రహస్యంగా ఉంచారు.
Pages: 1 -2- News Posted: 23 March, 2009
|