నష్టపోయినా మిట్టల్ టాప్
లండన్ : ప్రపంచ ఆర్థిక మాంద్యం ప్రభావంతో బ్రిటన్ లో బిలియనీర్ల సంఖ్య 75 నుంచి 2008లో 43కు తగ్గింది. కాని కోలకతాకు చెందిన ఉక్కు పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్ (58) తన సంపద 27.7 బిలియన్ పౌండ్ల (40.44 బిలియన్ డాలర్లు) నుంచి భారీ ఎత్తున 61 శాతం మేర అంటే 10.8 బిలియన్ పౌండ్లకు తగ్గినప్పటికీ సంపన్నుల జాబితాలో అగ్ర స్థానంలోనే కొనసాగుతున్నారు.
'సండే టైమ్స్' పత్రిక సంకలనం చేసిన వార్షిక జాబితా ప్రకారం, మిట్టల్ సంపద రష్యాలో జన్మించిన రోమన్ అబ్రమోవిచ్ (42) కన్నా రెండింతలు ఉంది. అబ్రమోవిచ్ సంపద ప్రస్తుతం 4.7 బిలియన్ పౌండ్లు. ఇది నిరుడి 11.7 బిలియన్ పౌండ్లుగా ఉంది.
కాగా, ఈ సంవత్సరం జాబితాలో నుంచి హిందూజా సోదరులు అదృశ్యం కావడం అత్యంత ఆశ్చర్యం కలిగిస్తున్నది. వారు 6.2 బిలియన్ పౌండ్ల విలువ చేసే సంపదతో క్రితం సంవత్సరం నాలుగవ స్థానంలో ఉన్నారు.
ఈ సంవత్సరం టాప్ 10 బిలియనీర్లలో చోటు చేసుకున్న ఏకైక భారతీయుడు మిట్టల్. ఈ జాబితాలో భారత సంతతికి చెందిన వారు 29 మంది ఉన్నారు.
ఇదిలా ఉండగా, అత్యంత సంపన్నులైన ఇద్దరు భారతీయులు ఉక్కు పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్, రియల్ ఎస్టేట్ ప్రముఖుడు కె.పి. సింగ్ కుమార్తెలు వరుసగా వనీషా మిట్టల్ భాటియా, పియా సింగ్ అత్యంత ప్రముఖ బిలియనీర్ వారసురాళ్ళకు సంబంధించిన ఫోర్బ్స్ పత్రిక జాబితాలో చోటు చేసుకున్నారు.
Pages: 1 -2- News Posted: 27 April, 2009
|