వడ్డీ రేటు తగ్గించండి
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖమంత్రి ప్రణబ్ ముఖర్జీ బుధవారంనాడు ప్రభుత్వ బ్యాంకర్లతో సమావేశమయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొని ఉన్నప్పటికీ ప్రభుత్వం, ఆర్‌బిఐ తీసుకున్న చర్యల ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగానే ఉందని ప్రణబ్ అన్నారు. బుధవారంనాడు ఆయన ప్రభుత్వ బ్యాంకుల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లతో సమావేశమయ్యారు. 2008-09 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెల్లో 5.8 శాతం ఉన్న వృద్ధిరేటు ఆర్థిక సంవత్సరం ముగింపునాటికి 6.7 శాతం చేరుకుందని అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ అభివృద్ధి అనుకూల చర్యల వల్ల ఆర్థిక వ్యవస్థ త్వరలోనే అభివృద్ధి దిశగా పయనిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
గత ఆర్థిక సంవత్సరంలో ఉత్తమ నిర్వహణ కనబరిచిన ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ ఏడాది కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆయన సూచించారు. పెట్టుబడులు లేని కారణంగా ప్రభుత్వ బ్యాంకులలో రుణాల మంజూరు తగ్గిపోయే పరిస్థితి ఏర్పడకుండా ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందని అన్నారు. గత 5 సంవత్సరాల్లో వ్యవసాయ రంగానికి బ్యాంకుల ద్వారా పరపతి మూడున్నర రెట్లు పెరిగిందని ఆయన చెప్పారు.
బ్యాంకర్లను వడ్డీ రేట్లు తగ్గించాల్సిందిగా ప్రణబ్ కోరగా, ఎట్టకేలకు మళ్లీ ప్రభుత్వం చొరవతో ప్రభుత్వ బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. ప్రభుత్వ బ్యాంకులు ఇక గృహ, ఇతర రిటెయిల్ రుణాలు, పరిశ్రమలకు వడ్డీరేట్లను త్వరలో తగ్గించనున్నాయి. ఆర్థికమాంద్యం నేపథ్యంలో ఎన్నో పరిశ్రమలు వ్యాపారాన్ని నడపడం కష్టమవుతుండడంతో బ్యాంకుల నుంచి రుణ లభ్యత కూడా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారికి చేయూతనందించాలన్న ఉద్ధేశంతో వడ్డీరేట్లను తగ్గించేందుకు కృషి చేసింది.
Pages: 1 -2- News Posted: 10 June, 2009
|