తగ్గిపోతున్న క్రెడిట్ కార్డులు
ముంబై : 2008 - 09 సంవత్సరంలో దాదాపు 30 లక్షల క్రెడిట్ కార్డులను చలామణిలో నుంచి ఉపసంహరించిన తరువాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి మాసంలో వాటి తగ్గుదల కొనసాగింది. దీనిని బట్టి ఈ పరిశ్రమ ఇంకా కుదింపు దశలోనే ఉందని విదితమవుతున్నది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) విడుదల చేసిన డేటా ప్రకారం, క్రెడిట్ కార్డుల సంఖ్య ఏప్రిల్ నెలలో 332000 మేరకు అంటే 24.38 మిలియన్లకు తగ్గిపోయింది.
చాలా క్రెడిట్ కార్డు సంస్థలు క్రియాశీలకం కాని, నిశ్చేతనంగా ఉన్న కార్డులను తొలగించసాగాయి. వాటిని కొనసాగించడం బ్యాంకులకు బిల్లింగ్, పోస్టేజ్ చార్జీల రూపంలో ఎక్కువ నష్టదాయకం అవుతుంది. అంతేకాకుండా కస్టమర్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా అటువంటి కార్డులను ఉపయోగించే ప్రమాదం కూడా ఉంది.
'వృద్ధి దశలో ఉన్నప్పుడు పెక్కు బ్యాంకులు కస్టమర్లకు కార్డులు జారీ చేశాయి. వారు వాటిని ఎన్నడూ ఉపయోగించలేదు. ఇప్పుడు పలు క్రెడిట్ కార్డు సంస్థలు ఆర్థికంగా పటిష్ఠం చేసుకునే దశలో ఉన్నాయి. క్రియాశీలకం కాని, నిశ్చేతనంగా ఉన్న కార్డుల విషయంలో అవి మరింత కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఆ కార్డులు అత్యంత రిస్క్ తరహావి కావడం ఇందుకు కారణం' అని హెచ్ఎస్ బిసి సంస్థలో కన్స్యూమర్ అసెట్స్, క్రెడిట్ కార్డ్స్ విభాగం అధిపతి రవి సుబ్రహ్మణ్యం చెప్పారు.
Pages: 1 -2- News Posted: 12 June, 2009
|