బెనారస్ చీరలకు పేటెంట్
న్యూఢిల్లీ : చైనీస్ నకిలీ చీరలు, సూరత్ మరమగ్గం నేత చీరల నుంచి బెనారస్ చీరలు, జరీలకు జిఐ (భౌగోళిక సూచిక) రక్షణ లభించింది. కంచి పట్టు చీరలకు కూడా జిఐ సర్టిఫికెట్ లభించబోతున్నది. జిఐ అనేది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ (ఐపిఆర్) అనే పేటెంట్ కు సూచిక. ఒక నిర్దుష్ట ప్రాంతానికి చెందిన ఒక ఉత్పత్తికి ఇచ్చే గుర్తింపు ఇది. సదరు ఉత్పత్తి నిర్దిష్ట నాణ్యత లేదా ఖ్యాతి లేదా దాని భౌగోళిక ప్రాశస్త్యాన్నిసూచించి ఏదేని లక్షణాన్ని బట్టి ఈ జిఐ సర్టిఫికెట్ ను ఇస్తారు.
సాంప్రదాయక బెనారసీ చీరలకు ఐక్యరాజ్య సమితి వ్యాపార, అభివృద్ధి సంస్థ (అంక్టాడ్) మద్దతుతో జిఐ సర్టిఫికెట్ లభించింది. దీని వల్ల ఇతర ప్రాంతాలు, దేశాలలో తయారై ఇండియాలో అమ్ముడుపోయే చీరల నుంచి ముప్పును చట్టబద్ధంగా అధిగమించడానికి నేత కార్మికులకు వీలు కలుగుతుంది. బెనారస్ బన్కర్ సమితి అధ్యక్షుడు లాల్ చంద్ రామ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మా అమ్మకాలు పెంచుకోవడానికి ఇది దోహదం చేస్తుంది. కొనుగోలుదారులు సిసలైన ఉత్పత్తిని పొందడానికి కూడా ఇది తోడ్పడుతుంది' అని చెప్పారు.
ఈ సర్టిఫికేషన్ చీరలకే కాకుండా పట్టు జరీ, డ్రెస్ మెటీరియల్, పక్క దుప్పట్లు, టేబుల్ కవర్లు వంటి సంబంధిత ఉత్పత్తులకు కూడా వర్తిస్తుంది.అంటే ఉత్తర ప్రదేశ్ లో గుర్తించిన ఆరు జిల్లాలకు వెలుపల తయారైన ఏ చీరనైనా లేదా పట్టు జరీనైనా బెనారస్ చీర, జరీ పేరిట అక్రమంగా విక్రయించరాదన్నమాట. జిఐ సర్టిఫికేషన్ పరిధిలోకి వచ్చే జిల్లాలు వారణాసి, ఆజమ్ గఢ్, చందౌలి, జాన్ పూర్, మీర్జాపూర్, సంత్ రవిదాస్ నగర్ - భాదోహి. దాదాపు ఒక నెల వ్యవధిలో వినియోగదారులు జిఐ లేబుల్ సాయంతో ఒరిజినల్ కంచి పట్టు చీరను తేలికగా గుర్తించగలుగుతారు. 21 సహకార సంస్థలు, పది ప్రైవేట్ వర్తక సంస్థలు ఈ గుర్తింపు కోసం దరఖాస్తు చేశాయి.
జిఐ సర్టిఫికేషన్ కు ఆమోదముద్ర లభించిన వెంటనే కాంచీపురం పట్టు బ్రాండ్ దుర్వినియోగం నిలిచిపోగలదని కో-ఆప్టెక్స్ గా పేర్కొనే తమిళనాడు చేనేత కార్మికుల సహకార సంస్థ డిప్యూటీ డైరెక్టర్ ఎం. పళనిచామి అన్నారు. 'రిజిస్ట్రేషన్ అనంతరం ఆమోదముద్ర లభించడానికి గడువు 90 రోజులు. ఒక నెలలో మా ఉత్పత్తులపై ఆ ముద్రను ఉపయోగించడం మేము ప్రారంభించవచ్చు' అని ఆయన చెప్పారు.
జరీని, దానిలో ఉపయోగించిన బంగారం పరిమాణం, నేత పని స్థాయిని బట్టి కంచి చీరలు దాదాపు రూ. 5000 నుంచి రూ. 3 లక్షల శ్రేణిలో లభ్యమవుతాయని తమిళనాడులో ప్రముఖ వస్త్రాల రీటైల్ సంస్థ పొత్తీస్ మేనేజింగ్ పార్ట్ నర్ ఎస్. రమేష్ తెలియజేశారు. అదనపు ఆకర్షణలు లేకుండా అసలు సిసలు కంచి పట్టు చీర దాదాపు రూ. 15 వేల ధరకు లభ్యం కావచ్చునని ఆయన సూచించారు.
Pages: 1 -2- News Posted: 18 September, 2009
|