పొదుపు డిపాజిట్లే పాపులర్
ముంబై : మూడున్నర శాతం వడ్డీ రేటు మాత్రమే ఇచ్చే వాణిజ్య బ్యాంకుల వద్ద సేవింగ్స్ డిపాజిట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పది లక్షల కోట్ల రూపాయల స్థాయిని దాటనున్నాయి. అయితే, గడచిన కొన్ని సంవత్సరాలలోని వృద్ధి రేటు కనుక కొనసాగినట్లయితేనే ఇది సాధ్యమవుతుంది. 2009 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల వద్ద గల సేవింగ్స్ డిపాజిట్ల మొత్తం రూ. 9,00,967 కోట్లుగా ఉన్నది. 2007-08 సంవత్సరంలోని రూ. 7,72,282 కోట్ల కన్నా ఇది సుమారు 17 శాతం అధికం. ఈ వృద్ధి రేటు కనుక కొనసాగినట్లయితే, ఈ డిపాజిట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ. 10,54,131 కోట్ల మేర ఉండవచ్చు. ప్రస్తుత రేట్ల ప్రకారం స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో పర్సంటేజిగా చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో పొదుపు డిపాజిట్లు సుమారు 17 శాతంగా ఉన్నాయి.
సేవింగ్స్ డిపాజిట్లకు ఇతర ఆర్థిక ఉత్పత్తులకు లేదా వనరులకు లేని కొన్ని విశిష్టతలు ఉన్నాయి. ఇవి పెట్టుబడి ప్రాడక్ట్ లు కావని సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ గౌరవ్ మష్రువాలా పేర్కొన్నారు. వడ్డీ రేట్లలో మార్పుల నుంచి లేదా స్టాక్ మార్కెట్లు వంటి ఇతర అసెట్ వనరులలో మార్పులు చేర్పుల నుంచి వీటికి ఈ విశిష్టతే రక్షణ కల్పిస్తున్నదని ఒక విశ్లేషకుడు అభిప్రాయం వెలిబుచ్చారు. 'మనందరికీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అవసరమవుతుంది. కాని వీటిని తెరిచేది వడ్డీ రేట్లను చూసి లేదా లాభాలు ఉంటాయా లేదా అని ఆలోచించి కాదు' అని మష్రువాలా అన్నారు.
Pages: 1 -2- News Posted: 22 September, 2009
|