పెరిగిన కార్ల అమ్మకాలు
హైదరాబాద్ : ఆర్థిక మాంద్యంతో కుంగిపోయిన హైదరాబాద్ నగరంలోని కార్ల డీలర్లకు ఈ సంవత్సరం పండగల సీజన్ నూతనోత్తేజాన్ని కలిగిస్తున్నది. కార్ల కొనుగోలు కోసం వచ్చే కస్టమర్ల సంఖ్య నానాటికి పెరుగుతున్నది. నగరంలోని వివిధ కార్ల విక్రేతల సమాచారం ప్రకారం, కార్ల అమ్మకాలు గడచిన మూడు మాసాలలో 40 శాతం పెరిగాయి.
కస్టమర్లు కార్లను కొనుగోలు చేస్తుండడమే కాకుండా బేస్ మోడల్స్ తో లేదా మామూలు కార్లతో సంతృప్తి పడకపోవడం కూడా కార్ల డీలర్లను ఆనంద పరవశులను చేస్తున్నది. 'స్విఫ్ట్ నుంచి వ్యాగన్ ఆర్, రిట్జ్ వరకు అన్ని కేటగరీల కార్లు ఈ సీజన్ లో అమ్ముడవుతున్నాయి. ఈ సీజన్ లో కార్ల కొనుగోలు విషయమే కస్టమర్లను మాంద్యం గాని, వేతనాల కోత గాని బాధిస్తున్నట్లు లేదు' అని మారుతి సంస్థ రీజనల్ మేనేజర్ తపన్ ఘోష్ 'టైమ్స్ ఆఫ్ ఇండియా' (టిఒఐ) విలేఖరితో చెప్పారు. మాంద్యం పరిస్థితులు ఉన్నప్పటికీ తమ సంస్థ గత నెల రోజులలో నాలుగు శాతం మేర వృద్ధి సాధించిందని ఆయన తెలిపారు. పండుగల సీజన్ ఇప్పుడే మొదలైందని, విజయదశమి రోజు, ఆతరువాత దీపావళికి ముందు మరిన్ని అమ్మకాలు జరగగలవని తాము ఆశిస్తున్నామని ఘోష్ చెప్పారు.
ఈ ఏడాది అమ్మకాలు బాగున్నాయని ఇతర కార్ల డీలర్లు కూడా తెలియజేశారు. గత దసరా సమయం కన్నా ఈసారి పరిస్థితి మెరుగ్గా ఉన్నదని వారు చెప్పారు. 'అమ్మకాలు దాదాపు క్రితం సంవత్సరం స్థాయిలో ఉన్నాయి. ఆర్థిక మాంద్యం అనంతరం పరిశ్రమ కుంగిపోయిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది అనూహ్య పరిణామమనే పేర్కొనాలి' అని మలిక్ కార్స్ సంస్థ అధికార ప్రతినిధి అన్నారు. అక్టోబర్ రెండవ వారంలో పండగల సీజన్ ముగిసేలోగా మరింత మంది కస్టమర్లు రాగలరని ఆయన సూచించారు. 'ఇదే కనుక జరిగినట్లయితే, ఈ సీజన్ నిరుటి కన్నా మెరుగ్గా ఉన్నట్లు కాగలదు' అని ఆయన అన్నారు.
Pages: 1 -2- News Posted: 25 September, 2009
|