అన్నతో అనిల్ రాజీ!
న్యూఢిల్లీ : అన్న ముఖేష్ అంబానీతో శాంతి కోసం అనిల్ అంబానీ అనూహ్యంగా ఆదివారం ఉదయం ప్రతిపాదన చేశారు. ముఖేష్ ఈ ప్రతిపాదనపై రోజంతా ఆలోచించారు. చివరకు ఆదివారం రాత్రి తన ప్రధాన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ద్వారా ఒక ప్రకటన వెలువరించారు. శాంతి యత్నాలను ఒక వైపు స్వాగతిస్తూనే మరొకవైపు అనిల్ పై కొన్ని విమర్శనాస్త్రాలను అందులో సంధించారు. అనిల్ రాజీ ప్రతిపాదన ప్రపంచానికి పై కప్పు అనదగిన కేదారనాథ్ నుంచి వచ్చింది. అనిల్ అక్కడి నుంచి తన అగ్రజునికి స్నేహ హస్తం చాచారు. అయితే, చివరకు అన్నదమ్ములిద్దరూ తమ విభేదాలకు స్వస్తి చెప్పినా చెప్పకపోయినా పెట్టబడిదారునికి వచ్చే నష్టమేమీ లేదు సరికదా ప్రయోజనాలనే పొందవచ్చు.
గఢ్వాల్ హిమాలయాలలోని కేదారనాథ్ ఆలయం దగ్గర నుంచి మీడియాకు తన ఫోటోతో పాటు ఇ-మెయిల్ చేసిన ఒక ప్రకటనలో అనిల్ అంబానీ ఇలా పేర్కొన్నారు : 'ఇప్పటికే ఆలస్యమైనప్పటికీ ముఖేష్ భాయ్, నేను మా భేదాభిప్రాయాలను నిర్మాణాత్మక, సుహృద్భావపూర్వక, రాజీ వాతావరణంలో పరిష్కరించుకోగలమని నేను చిత్తశుద్ధితో విశ్వసిస్తున్నాను. సమస్యలు ఏవో స్వల్పంగా ఉన్నాయి. వాస్తవాలు సువిదితమే. కొన్ని వారాల వ్యవధిలో వాటినన్నిటినీ పరిష్కరించుకోవచ్చునని, ఇందుకు నెలల తరబడి చర్చలు అవసరం లేదని నా భావన'.
ఆర్ఐఎల్ ఆదివారం రాత్రి పొద్దుపోయిన తరువాత ఒక ప్రకటనలో తన స్పందన తెలియజేసింది. అనిల్ ప్రకటనను 'అత్యంత శ్రద్ధతో, కడు జాగరూకతతో' పరిశీలించినట్లు ఆర్ఐఎల్ తన ప్రకటనలో తెలియజేసింది. ఆర్ఐఎల్ పట్ల 'వ్యతిరేకతతో, దూషణలతో, దురుద్దేశంతో కూడిన ప్రచారానికి స్వస్తి చెపుతున్న సూచనలను' తాము గమనించినట్లు సంస్థ తెలిపింది. 'రాజీ ప్రతిపాదనను సదుద్దేశంతో, నిజాయితీతో చేసి ఉన్నట్లయితే' వివాదాలన్నిటినీ చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చునని ఆర్ఐఎల్ అభిప్రాయం వ్యక్తం చేసింది. అటుపిమ్మట సంస్థ సన్నాయి నొక్కులు నొక్కింది. అనిల్ మరొకసారి నొక్కిచెబుతున్నట్లుగా 'కోర్టు ముందున్న వివాదం కేవలం కుటుంబ వ్యవహారం కాదు' అని ఆర్ఐఎల్ పేర్కొన్నది. కుటుంబ సెంటిమెంట్లను పక్కన పెట్టితే ఈ వివాదం ఇప్పుడు సుప్రీం కోర్టులో మాత్రమే తేలగలదని కూడా సంస్థ స్పష్టం చేసింది. అయినప్పటికీ, ఈ రాజీ ప్రతిపాదన పట్ల ఆర్ఐఎల్ హర్షం వ్యక్తం చేసింది. 'నిర్మాణాత్మకంగా' వ్యవహరించడంలో తాము వెనుకపడబోమని ఆర్ఐఎల్ పేర్కొన్నది.
Pages: 1 -2- News Posted: 12 October, 2009
|