శివకాశిలో డైరీల 'బూమ్'
శివకాశి : తమిళనాడులోని శివకాశిలో తయారైన బాణసంచా దీపావళికి దేశమంతటా వెలుగులు విరజిమ్మగా ఇప్పుడు ఈ పట్టణం నుంచి మరో రంగం హైటెక్ ప్రపంచం నుంచి పోటీని తోసిరాజని అపారంగా లాభాలు ఆర్జించబోతున్నది. ఈ సంవత్సరం శివకాశి ఒక్కటే దేశీయ మార్కెట్ కు కోటికి పైగా డైరీలను సరఫరా చేయబోతున్నది. 2008లో శివకాశి నుంచి డైరీల సరఫరా బాగా పడిపోయింది. ఆర్థిక మాంద్యం కారణంగా కంపెనీలు, చివరకు చిన్న చిన్న సంస్థలు కూడా డైరీల కోసం ఆర్డర్లు ఇవ్వలేకపోవడం లేదా తమ ఆర్డర్లను తగ్గించుకోవడం జరిగింది. కాని 2009 శివకాశిలోని డైరీల ఉత్పత్తి సంస్థలకు దండిగా లాభాలు ఆర్జించిపెట్టనున్నది.
'2008లో కంపెనీలు అక్టోబర్ చివరి వరకు తమ డైరీలపై నిర్ణయాలు తీసుకోలేకపోయాయి. కాని ఈ సంవత్సరం అలా కాకుండా మాకు మరిన్ని అడ్వాన్స్ ఆర్డర్లు వచ్చాయి. పరిస్థితులు మెరుగయ్యాయనేందుకు ఇది సూచిక కావచ్చు. డైరీ వ్యాపారం పది శాతం పెరిగింది' అని శివకాశి మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ (ఎస్ఎంపిఎ) మేనేజర్ దేవ్ ప్రసాద్ తెలియజేశారు.
'భారతీయుల మనస్సులలో డైరీకి ప్రత్యేక స్థానం ఉన్నది. నెలసరి ఖర్చులపై ఒక కన్ను వేసేందుకు ప్రతి గృహిణీ కొత్త డైరీ కావాలనుకుంటుంది. మా కంపెనీ వెలువరించే డైరీ అడ్వాన్స్ బుకింగ్ కోసం నాకు మిత్రులు, బంధువుల నుంచి డిసెంబర్ ప్రారంభం నుంచే కాల్స్ వస్తుంటాయి' అని ఒక కార్పొరేట్ సంస్థ కమ్యూనికేషన్స్ మేనేజర్ కె. శ్రీరామ్ చెప్పారు.
రెండు లక్షల జనాభాతో, 600 ప్రింటింగ్ ప్రెస్ లతో శివకాశి ప్రపంచంలో జర్మనీలోని గూటెన్ బర్గ్ తరువాత రెండవ పెద్ద ప్రింటింగ్ పట్టణంగా ఖ్యాతి గడించింది. గూటెన్ బర్గ్ లోనే 1439లో తొలి ముద్రణ యంత్రాన్ని కనుగొన్నారు.
Pages: 1 -2- News Posted: 19 October, 2009
|