నకిలీ నోట్ల పాట్లు
భారతదేశాన్ని ఛిన్నాభిన్నం చేయడానికి శత్రుమూకలు అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటున్నారు. భౌతిక దాడులకు తెగబడుతూ భయోత్పాతం సృష్టిస్తున్న ఉగ్రవాద మూకలు ఆర్థికంగా కూడా దేశాన్ని దెబ్బతీయడానికి ప్రణాళికలు రూపొందించారు. దానిలో భాగంగానే భారీ ఎత్తున నకిలీ కరెన్సీని సృష్టించి దేశంలో చెలామణి చేస్తున్నారు. అన్నింటికీ ఆలస్యంగా కన్నుతెరిచే కేంద్రం కొన్ని వేల కోట్ల నకిలీ నోట్లు దేశంలోకి చొరబడిన తర్వాత ఇప్పుడు వాటిని ఏరివేసే పనిని చేపట్టింది. అసలు వాటిని దేశంలో ప్రవేశించకుండా చూసే యంత్రాంగం ఇంతకాలం నిద్రపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం కావడంతోపాటు సామాన్య పౌరులు కూడా ఈ నకిలీ నోట్ల బారిన పడి ఆర్థికంగా దెబ్బతినిపోతున్నారు.
ప్రభుత్వ నిఘావర్గాల అంచనా ప్రకారం దేశంలో రెండువేల కోట్లకు పైగా నకిలీ నోట్ల చెలామణి జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా 1000, 500 రూపాయల డినామినేషన్లలోనే అధికంగా కన్పిస్తున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు ఇప్పటికే రిజర్వు బ్యాంక్ కు ఉప్పందించాయి. ఇందులో ముఖ్యంగా 1000 రూపాయల నకిలీ నోట్లు 11 సిరీస్ ల్లో ముద్రించినట్లు గుర్తించగా, సుమారు 23 సిరీస్ ల్లో నకిలీ 500 లను ముద్రించి చెలామణిలో పెట్టినట్లు ఓ అంచనా. ముఖ్యంగా జమ్మూ, కాశ్మీర్, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాలు, నేపాల్ నుండి ఈ కరెన్సీ దేశంలోకి ప్రవేశపెడుతున్నట్లు అనుమానిస్తున్నారు. ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సహకారంతో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎన్ఐ పెద్ద ఎత్తున నకిలీ భారతీయ కరెన్సీని చెలామణి చేయిస్తున్నట్లు ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్ కు, భారత్ కు కరెన్సీ పేపర్ ను సప్లయ్ చేస్తున్నది ఒకే దేశం కావడంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భారతీయ నకిలీ కరెన్సీని ముద్రిస్తుండడంతో సామాన్యులు వీటిని గుర్తించలేని పరిస్థితి ఉంది. రెండేళ్ళుగా ఈ తతంగం సాగుతున్నట్లు అర్థమవుతోంది. దేశంలోని వివిధ వాణిజ్య బ్యాంకులకు సంబంధించిన ఎటిఎంలలో కూడా నకిలీ కరెన్సీ ప్రత్యక్షం కావడం అందరినీ కలవరపరుస్తోంది.
Pages: 1 -2- News Posted: 27 October, 2009
|