డిజిటల్ విద్యలోకి 'డెల్'
ముంబై : 49.2 బిలియన్ డాలర్ల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ డెల్ భారతీయ విభాగం డెల్ ఇండియా విద్యార్థులకు లాప్ టాప్ లు, నోట్ బుక్ లు విక్రయించి, డిజిటల్ కాంపస్ లను నిర్మించేందుకై విద్యా రంగంలోకి ప్రవేశించబోతున్నది. విద్యా రంగంలో ఐటి వ్యయాన్ని పెంచబోతున్నందున తాము ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అభిలషిస్తున్నట్లు డెల్ ఇండియా అధికారులు తెలియజేశారు.
'విద్యా రంగంలో ఐటిపై వ్యయాన్ని 2008లోని సుమారు 356 మిలియన్ డాలర్ల నుంచి 2012లో 704 మిలియన్ డాలర్లకు పెంచవచ్చునని స్ప్రింగ్ బోర్డ్ రీసర్చ్ అంచనా వేసింది. 2007, 2012 మధ్య కాలంలో 19 శాతం ఉండవచ్చునని అనుకుంటున్న సిఎజిఆర్ దామాషాను ఇది ప్రతిబింబిస్తున్నది' అని డెల్ ఇండియా సంస్థ ప్రభుత్వ రంగం, విద్యా విభాగం జనరల్ మేనేజర్ నీరజ్ గుప్తా తెలిపారు.
భారతదేశంలో విద్యా రంగం డిజిటల్ అవుతుండడం వల్ల తమ సంస్థకు వాణిజ్యపరంగా వృద్ధి చెందడానికి ఇతోధికంగా అవకాశాలు లభిస్తాయని డెల్ సంస్థ ఆసియా - పసిఫిక్ విభాగం (ప్రభుత్వ రంగం, విద్య) జనరల్ మేనేజర్ జో క్రెమెర్ చెప్పారు. 'లాప్ టాప్ లు, నోట్ బుక్ లు, డెస్క్ టాప్ లు, ఆడియో విజువల్ పరికరాలు, ఇతర ఐటి సొల్యూషన్లతో క్లాస్ రూమ్ లను అనుసంధానిస్తూ, కంప్యూటర్ లాబ్ లను పెంచాలని మేము అనుకుంటున్నాం. దీనివల్ల విద్యార్థులకు ఇంటరాక్టివ్ ఇ-లెర్నింగ్ పెరుగుతుంది' అని ఆయన తెలిపారు.
'లాప్ టాప్ లు, నోట్ బుక్ లు, ఐటి ఆధారిత ఉత్పత్తుల వల్ల విద్యార్థులకు సమస్యలను పరిష్కరించే, నిశితంగా ఆలోచించే నైపుణ్యం పెంపొందుతుంది' అని ఆయన చెప్పారు. లాప్ టాప్ లు అందుబాటులో ఉండడంతో విద్యార్థులకు క్లాస్ అసైన్ మెంట్లకు సంబంధించి రకరకాల సమాచార వనరులు వెంటనే లభ్యం కాగలవని ఆయన సూచించారు.
Pages: 1 -2- News Posted: 5 November, 2009
|