షేర్లు అమ్మేసిన ఇన్ఫీ సుధ
బెంగళూరు : ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణమూర్తి సతీమణి సుధా మూర్తి తన అధీనంలో ఉన్న 20 లక్షల షేర్లను విక్రయించేశారు. వీటి విలువ 430 కోట్ల రూపాయలకు పైనే అని ఇన్ఫోసిస్ వర్గాలు తెలిపాయి. గురువారం ఓపెన్ మార్కెట్ లో వీటిని అమ్మేశారని వివరించాయి. ఈ విక్రయం అనంతరం కంపెనీలో సుధా మూర్తికి 73.14 లక్షల షేర్లు మాత్రమే ఉంటాయి. అంటే కంపెనీ వాటాలలో 1.27 శాతం అన్నమాట. ఈ అమ్మకం ద్వారా సమీకరించిన డబ్బును సుధామూర్తి తన భర్త స్థాపించిన వెంచర్ కాపిటల్ ఫండ్ 'కాటమరాన్' కంపెనీకి కార్పస్ ఫండ్ గా వినియోగిస్తారు.
స్టాక్ ఎక్స్ చేంజీలకు ఇన్ఫోసిస్ అందజేసిన రెగ్యులేటరీ సమాచారం ప్రకారం, సుధామూర్తి తన అధీనంలోని మొత్తం రూ. 430.37 కోట్లు విలువ చేసే 20 లక్షల వాటాలను గురువారం బొంబాయి స్టాక్ ఎక్స్ చేంజి (బిఎస్ఇ)లో ఓపెన్ మార్కె ట్ విక్రయ విధానం ద్వారా విక్రయించారు. దీని ద్వారా సమకూరిని నిధులను 'ముఖ్యంగా ఇండియాలో యువ వాణిజ్యవేత్తలకు వారి వ్యాపారంలో సాయం చేసేందుకు తాను ఏర్పాటు చేస్తున్న వెంచర్ కాపిటల్ (విసి) ఫండ్ లో కార్పస్ గా వినియోగించనున్నట్లు ఎన్.ఆర్. నారాయణమూర్తి కంపెనీకి తెలియజేశారు' అని సంస్థ తన ప్రకటనలో వివరించింది.
ఈ విక్రయం అనంతరం సుధామూర్తి వాటాలు 73.14 లక్షలకు తగ్గిపోతాయి. ఇవి కంపెనీ వాటాలలో 1.27 శాతం మేర ఉంటాయి. వెంచర్ కాపిటల్ ఫండ్ లో పెట్టుబడి నిమిత్తం రూ. 174 కోట్లు సమీకరించడానికై నారాయణమూర్తి క్రితం నెల 0.13 శాతం వాటాలను విక్రయించారు.
Pages: 1 -2- News Posted: 6 November, 2009
|