'రియల్'కు లాంకో గుడ్ బై
న్యూఢిల్లీ : లాంకో ఇన్ ఫ్రా టెక్ సంస్థ రియల్ ఎస్టేట్ రంగం నుంచి తప్పుకోవాలని నిశ్చయించింది. ఇంజనీరింగ్, నిర్మాణ, సేకరణ, కొనుగోలు కాంట్రాక్టులు చేపట్టడం, రోడ్లు, రహదారులు, రేవులకు ఆర్డర్లు సంపాదించడంతో పాటు కీలకమైన విద్యుదుత్పాదన రంగంపై దృష్టి కేంద్రీకరించే ఉద్దేశంతో లాంకో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, హైదరాబాద్, చెన్నై నగరాలలో రెండు లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులను తమ సంస్థ పూర్తి చేయగలదని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జి. వెంకటేష్ బాబు ఆదివారం వెల్లడించారు.
'రియల్ ఎస్టేట్ రంగంలో పెక్కు సంస్థలు ఉన్న విషయాన్ని గ్రహించినందున కొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేపట్టరాదని నిశ్చయించాం' అని వెంకటేష్ బాబు తెలియజేశారు. దేశంలో విద్యుత్ లోటు పెరుగుతుండడం, ఇతర రంగాలతో పోలిస్తే తక్కువ సంస్థలు ఉండడం వల్ల ఈ రంగం లాభదాయకంగా కనిపిస్తున్నదని ఆయన తెలిపారు.
హైదరాబాద్ నగరంలో 100 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో రూ. 5500 కోట్లతో లాంకో హిల్స్ ప్రాజెక్ట్ ను లాంకో సంస్థ నిర్మిస్తున్నది. ఈ ప్రాజెక్టులో భాగంగా 15 రెసిడెన్షియల్ టవర్లు, ప్రత్యేక ఆర్థిక మండలులు, వివిధ వాణిజ్య భవనాలను సంస్థ నిర్మిస్తున్నది. చెన్నైలో లాంకో హొరైజన్ ప్రాపర్టీస్ నిర్మాణాన్ని కూడా సంస్థ తలపెట్టింది. 80 ఎకరాల విస్తీర్ణంలో ఈ బస్తీ నిర్మాణం జరుగుతుంది.
Pages: 1 -2- News Posted: 9 November, 2009
|