మళ్ళీ పెరిగిన కార్ల డిమాండ్
న్యూఢిల్లీ: కార్ల కొనుగోలుదారులు తాము కోరుకున్న వాహనాలను సొంతం చేసుకునేందుకు వేచి ఉండవలసిన గడ్డురోజులు మళ్లీ రానునున్నాయి. దీపావళి అనంతర అమ్మకాలు అనూహ్యంగా పెరిగాయని ఉత్పత్తిదారులు చెబుతున్నారు. ఫలితంగా 'స్విఫ్ట్' నుంచి 'హోండా సిటీ' వరకు దాదాపు అన్ని మోడళ్ళ కోసం ఒక నెల నుంచి నాలుగు నెలల వరకు కస్టమర్లు నిరీక్షించవలసి వస్తున్నది.
మారుతి సుజుకి కొత్తగా ప్రవేశపెట్టిన 'రిట్జ్' కోసం నిరీక్షణ కాలం రెండు నెలలకు పైగా ఉన్నట్లు తెలుస్తున్నది. హోండా సిటీ మోడల్స్ విషయంలో ఈ నిరీక్షణ వ్యవధి నాలుగు నెలల వరకు ఉంటున్నది. కారు కోసం సగటు నిరీక్షణ వ్యవధి ఆరు వారాల నుంచి ఎనిమిది వారాల వరకు ఉంటున్నది.
పండుగల సీజన్ ముగిసిన తరువాత నెల రోజులైనా కార్ల కోసం క్యూలు తరగకపోవడం ఉత్పత్తిదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. 'మేము మా ప్లాంట్లను పూర్తి సామర్థ్యం మేరకు నడుపుతున్నాం. ఏ సంవత్సరం అయినా ఈ సమయంలో ఇలా ఎప్పుడూ జరగలేదు. నవంబర్ - డిసెంబర్ డిమాండ్ ఎప్పటి కన్నా ఎక్కువగా ఉంది' అని మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) సంస్థ ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ రంగం) పవన్ గోయెంకా తెలియజేశారు. గ్జైలో (మల్టీ యుటిలిటీ వెహికిల్-ఎంయువి), స్కార్పియో (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్-ఎస్ యువి), బొలేరో (ఎంయువి)ల కోసం సగటున రెండు వారాల నుంచి మూడు వారాల వరకు నిరీక్షణ వ్యవధి ఉంటున్నదని గోయెంకా తెలిపారు. దేశంలో యుటిలిటీ వెహికిల్స్ ను అధిక సంఖ్యలో ఉత్పత్తి చేసే సంస్థ ఎంఅండ్ఎం.
అదే విధంగా కొరియా కార్ బ్రాండ్ హ్యుందై మోటార్స్ కూడా దీపావళి తరువాత తన ప్రధాన మోడల్స్ 'ఐ10', `ఐ20' కోసం డిమాండ్ బాగా పెరిగిందని తెలియజేసింది. 'గత సంవత్సరం నవంబర్ లో కన్నా ఇప్పుడు రీటైల్ డిమాండ్ కనీసం 20 శాతం నుంచి 25 శాతం వరకు అధికంగా ఉంది' అని హ్యుందై మోటార్ ఇండియా సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్, సేల్స్) అరవింద్ సక్సేనా వెల్లడించారు.
Pages: 1 -2- News Posted: 13 November, 2009
|