అమ్మకానికి సెయిల్
న్యూఢిల్లీ : సెయిల్, బిఎస్ఎన్ఎల్, కోల్ ఇండియాతో సహా 60 ప్రభుత్వ రంగ సంస్థ (పిఎస్ యు)లలో వాటాల అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం పథకాలు రూపొందిస్తున్నది. ప్రభుత్వానికి 90 శాతం పైగా వాటాలు ఉన్న పది పిఎస్ యులను గుర్తించేందుకు ఇతర ప్రభుత్వ శాఖలతో ఆర్థిక మంత్రిత్వశాఖ అప్పుడే చర్చలు ప్రారంభించింది. ప్రభుత్వ వాటాలను 90 శాతానికి లేదా సెబీ నిబంధనలు నిర్దేశించిన ప్రకారం 90 శాతం లోపు స్థాయికి తగ్గించడం ప్రభుత్వ లక్ష్యం. లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ, లిస్ట్ లో చేర్చని మరి 50 సంస్థలలో వాటాలను కూడా విక్రయించడానికి కేంద్రం ప్రయత్నించగలదు. ఈ వాటాల విక్రయం కొంత వ్యవధిని తీసుకోవచ్చు. మొత్తం కార్యక్రమం పూర్తయ్యేసరికి మూడు సంవత్సరాలు, అంతకు మించి వ్యవధి పట్టవచ్చు.
'లిస్టింగ్ లు కంపెనీలలో షేర్ హోల్డర్ విలువను అన్ లాక్ చేయగలదు. వాటాల విక్రయం నిమిత్తం తగిన సంస్థలను గుర్తించేందుకు మంత్రిత్వశాఖల స్థాయి చర్చలను ప్రారంభించాం. ఏ సంస్థకు ఆ సంస్థ ప్రాతిపదికపై ఈ వాటాల విక్రయం విషయాన్ని పరిశీలిస్తాం' అని వాటాల విక్రయ విభాగం కార్యదర్శి సునీల్ మిత్రా తెలియజేశారు. ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రథమార్ధంలో ఎన్ హెచ్ పిసి, ఆయిల్ ఇండియా సంస్థలను స్టాక్ ఎక్స్ చేంజ్ లలో లిస్టులలో చేర్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలోగా ఎన్ టిపిసి లిమిటెడ్, గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ (ఆర్ఇసి) లిమిటెడ్, సట్లుజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (లిస్ట్ కానిది) సంస్థలలో వాటాలను విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తున్నది.
Pages: 1 -2- News Posted: 14 November, 2009
|