భోజనం మరింత భారం
న్యూఢిల్లీ : తిండి మరింత ఖరీదైపోనుంది. సామాన్యుని రోజువారీ భోజనం చేయడం మరీ భారంగా మారనుంది. కరవు కారణంగా పంటల దిగుబడి తగ్గడం, ఆహర, వినిమయ వస్తువుల ధరల పెరుగుదల కారణంగా రానున్న నెలలలో బతుకు మరింత అధ్వాన్నం కావచ్చును. దేశం ఆర్థిక మాంద్యం నుంచి కోలుకుంటున్నా, ఫలితం ఉఁడకపోవచ్చునని ప్రముఖ ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. దేశంలో పేదల జీవన ప్రమాణాలు మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
సెప్టెంబర్ లో పారిశ్రామిక ఉత్పత్తి ఆశ్చర్యకరంగా 9.1 శాతం మేర పెరిగిందని ప్రభుత్వం క్రితం గురువారమే వెల్లడించింది. అయితే, అదే రోజు విడుదలైన మరొక డేటాను విధాన నిర్ణేతలు కొందరు ప్రస్తావిస్తున్నారు. ఏడాది క్రితం స్థాయి నుంచి ఆహార వస్తువుల ధరలు 13.7 శాతం మేర విపరీతంగా పెరిగాయని అక్టోబర్ నెలకు సంబంధించిన టోకు ధరల సూచిని వారు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.
కాగా, ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్న అంశాలలో ద్రవ్యోల్బణం తిరిగి చోటు చేసుకున్నది. 'ద్రవ్యోల్బణం బాగా అధికంగా ఉన్నది. మేము కలవరం చెందుతున్నాం' అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ నెలారంభంలో చెప్పారు. నిత్యవసర సరుకులు, ఇతర ఆహర పదార్ధాల టోకు ధరలకు, రీటైల్ ధరలకు మధ్య పెరుగుతున్న వ్యత్యాసం 'కలవరపెడుతున్నది' అని ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. ఉదాహరణకు పప్పు ధన్యాల టోకు ధరలు గత సంవత్సరం దాదాపు 21 శాతం మేర పెరగగా, వాస్తవంగా వినియోగదారులు చెల్లిస్తున్నది 50 శాతం అధికంగా ఉంటున్నది.
తగిన స్థాయిలో వర్షాలు పడక పంటల దిగుబడులు తగ్గినప్పటి నుంచి ఆహార పదార్థాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. జూన్-సెప్టెంబర్ కాలపు ఖరీఫ్ దిగుబడులు ఈ సంవత్సరం 18 శాతం మేర తగ్గవచ్చునని వ్యవసాయ మంత్రిత్వశాఖ అంచనా. 'వ్యవసాయోత్పత్తుల తగ్గుదలను పరిగణనలోకి తీసుకుంటే ఈ (ధరల) రంగంపై ఒత్తిడి శీతాకాలపు పంటలు జనవరి-ఫిబ్రవరి కాలంలో మార్కెట్ కు చేరుకునేంత వరకు కొనసాగవచ్చు' అని గోల్డ్ మాన్ సాక్స్ సంస్థ ఆర్థికవేత్తలు ప్రాంజుల్ భండారి, తుషార్ పోద్దార్ అక్టోబర్ లో విడుదల చేసిన పరిశోధన నివేదికలో సూచించారు.
Pages: 1 -2- News Posted: 15 November, 2009
|