రిలయన్స్'చిల్లర' చిల్లు
ముంబై : భారత వ్యాపార దిగ్గజం రిలయన్స్ నడుపుతున్న చిల్లర వ్యాపారాలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. రిలయన్స్ రీటైల్ (ఆర్ఆర్) సంస్థ విభాగాలు ఏవీ ఇంతవరకు లాభాలను ఆర్జించలేదని తేలింది. ఈ సంస్థ ఒక్క 2008 - 09 సంవత్సరంలోనే రూ. 450 కోట్లకు పైగా నష్టాలు వచ్చినట్లు తెలియజేసింది. ముఖేష్ అంబానీ 2006లో రిటైల్ వాణిజ్య సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థలో ఇప్పుడు 15 విభాగాలు ఉన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) నుంచి సేకరించిన డేటా ప్రకారం, 2009 మార్చి వరకు రిలయన్స్ ఫ్రెష్ అన్నిటికన్నా అధికంగా రూ. 276.77 కోట్ల మేరకు నష్టాలు చవి చూసింది. రిలయన్స్ హైపర్ మార్ట్ కు రూ. 54.32 కోట్ల మేరకు, రీటైల్ కాన్సెప్ట్స్ అండ్ సర్వీసెస్ కు రూ. 38.37 కోట్ల మేరకు, రిలయన్స్ వాంటేజ్ రీటైల్ కు రూ. 21.23 కోట్ల మేరకు నష్టాలు వచ్చాయి. రిలయన్స్ డెయిరీ ఫుడ్స్ రూ. 7.63 కోట్లు, రిలయన్స్ డిజిటల్ రీటైల్ రూ. 15.49 కోట్లు, రిలయన్స్ ఫుట్ ప్రింట్ రూ. 10.47 కోట్లు, రిలయన్స్ ట్రెండ్స్ రూ. 3.1 కోట్లు, రిలయన్స్ జెమ్స్ అండ్ జ్యుయెల్స్ రూ. 5.73 కోట్లు, రిలయన్స్ హోమ్ స్టోర్ రూ. 4.54 కోట్ల మేరకు నష్టాలు చవి చూశాయి.
ఆర్ఐఎల్ కు సంబంధించిన కుదించని వార్షిక నివేదిక ఈ నష్టాలను ధ్రువీకరిస్తున్నది. ఈ విషయమై సంస్థ వ్యాఖ్య కోసం పంపిన ఇ-మెయిల్ కు సమాధానం రాలేదు. సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశానికి ముందు కాలంలో మౌనం వహించవలసి రావడమే ఇందుకు కారణం కావచ్చు.
దేశంలో అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లో భాగమైన రిలయన్స్ రీటైల్ (ఆర్ఆర్) ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలలో 900 స్టోర్స్ ను నడుపుతున్నది. వీటిలో సూపర్ మార్కెట్, కన్వీనియన్స్ స్టోర్, మినీ హైపర్ మార్ట్ విభాగాలు చేరి ఉన్నాయి. ఇంకా కళ్ళజోళ్ళ నుంచి ఆభరణాల వరకు ప్రతి వస్తువునూ విక్రయించే ప్రత్యేక విభాగాలు కూడా ఆర్ఆర్ లో ఉన్నాయి. మార్క్స్ అండ్ స్పెన్సర్, ఆఫీస్ డిపో, హామ్లీస్ వంటి సంస్థలతో భాగస్వామ్యం కూడా కలిగి ఉన్న ఆర్ఆర్ కు ఇప్పుడు 50 లక్షల మందికి పైగా కస్టమర్లు ఉన్నారు. వివిధ షాపర్ల అవసరాలు తీర్చేందుకు స్పెషలైజ్ చేసిన రీటైల్ విభాగాల కోసం ప్రపంచంలోని పెద్ద సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకొనేందుకు ఆర్ఆర్ ఇప్పుడు ఒక వ్యూహాన్ని రూపొందించింది.
Pages: 1 -2- News Posted: 16 November, 2009
|