కుబేరుల్లో టాప్ ముఖేష్
సింగపూర్ : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అధినేత ముఖేష్ అంబానీ దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో అగ్ర స్థానాన్ని తిరిగి ఆక్రమించారు. ఆయన నికర సంపద 32 బిలియన్ డాలర్లు అంటే దాదాపు లక్షా 60 వేల కోట్ల రూపాయలు. క్రితం సంవత్సరపు సంపద సుమారు 21 బిలియన్ డాలర్ల కన్నా ఇది 54 శాతం అధికం. 'ఫోర్బ్స్ ఇండియా రిచ్' జాబితాలో ఈ వివరాలు పొందుపరిచారు. ఈ జాబితాలో ముఖేష్ తరువాతి స్థానాన్ని లక్ష్మీ మిత్తల్ ఆక్రమించారు. లక్ష్మీ మిత్తల్ నికర సంపద 30 బిలియన్ డాలర్లు. ఆయన సంపద నిరుటి 20.5 బిలియన్ డాలర్ల నుంచి 46 శాతం మేర పెరిగింది. ముఖేష్ తమ్ముడు అనిల్ 17.5 బిలియన్ డాలర్లతో మూడవ స్థానంలో ఉన్నారు. అనిల్ సంపద గత యేడాడి కన్నా 40 శాతం పెరిగింది.
గడచిన సంవత్సరంలో మూడింట రెండు వంతులు వృద్ధి చెందిన స్టాక్ మార్కెట్, ఆరు శాతం మేర వృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కారణంగా దేశంలో అత్యంత సంపన్నుల నికర సంపద పెరిగిందని ఫోర్బ్స్ ఇండియా వ్యాఖ్యానించింది. దేశంలో అత్యంత సంపన్నులు 100 మంది ఉమ్మడి సంపద 276 బిలియన్ డాలర్లు. ఇది దేశ జిడిపిలో దాదాపు నాలుగవ వంతు ఉంటుంది. నిరుడు 'ఇండియా రిచ్' జాబితాలో 27 బిలియనీర్లు మాత్రమే చోటు చేసుకున్నారు. ఈ సంవత్సరం ఆ సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. అంటే 52కు పెరిగింది 2007లో స్టాక్ మార్కెట్ బూమ్ గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పుడు ఉన్న బిలియనీర్ల సంఖ్య కన్నా ఇది రెండు తక్కువ.
'ఫోర్బ్స్ ఏషియా' ఇండియా ఎడిటర్, ఫోర్బ్స్ పత్రిక ముంబై బ్యూరో మేనేజర్ నాజ్నీన్ కర్మాలి ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'భారతదేశంలోని అత్యంత సంపన్నులకు తిరిగి ఆనందకరమైన రోజులు వచ్చాయి. ఆర్థిక మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులు సవ్యంగా ఉంటే ఈ భూమిపై గల దేశాలు చాలావాటి కన్నా శీఘ్రగతిని బిలియనీర్లను తయారు చేయగల స్థాయి, వనరులు ఇండియాకు ఉన్నాయని ఈ సంవత్సరపు జాబితా మరొకసారి సూచిస్తున్నది' అని పేర్కొన్నారు.
Pages: 1 -2- News Posted: 19 November, 2009
|