19 చెల్లిస్తే మీ నెంబర్ మీదే!
ముంబై : 2010 జనవరిలో వినియోగదారులు తమ మొబైల్ నంబర్ ను అట్టిపెట్టుకుంటూనే రూ. 19 మాత్రమే చెల్లించి తమ సర్వీస్ ప్రొవైడర్ ను మార్చుకోవచ్చు. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న టెలికామ్ మార్కెట్ ఇండియాలో మొబైల్ ఫోన్ సంస్థల పోటీని ఉధృతం చేస్తూ, కాల్ చార్జీలను ఇంకా తగ్గించేందుకు దోహదం చేయగల చర్యగా టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఒక మొబైల్ ఆపరేటర్ నుంచి మరొక ఆపరేటర్ కు మారేందుకు పోర్టింగ్ చార్జీలు 'రూ. 19కి మించరాదు' అని శుక్రవారం ఉత్తర్వు జారీ చేసింది.
ఇండియా డిసెంబర్ 31న 'మొబైల్ నంబర్ పోర్టబిలిటీ' (ఎంఎన్ పి)ని ప్రవేశపెట్టబోతున్నది. వినియోగదారులు ఒక ఏక్సెస్ ప్రొవైడర్ నుంచి మరొకరికి మారినప్పటికీ తమ ప్రస్తుత మొబైల్ టెలిఫోన్ నంబర్ ను అట్టిపెట్టుకునేందుకు ఎంఎన్ పి వీలు కల్పిస్తుంది. ఒక లైసెన్సుడ్ సర్వీస్ పరిధిలో మొబైల్ టెక్నాలజీ ఏదైనప్పటికీ లేదా ఒక సెల్యూలార్ మొబైల్ టెక్నాలజీ నుంచి అదే ఏక్సెస్ ప్రొవైడర్ కు సంబంధించిన టెక్నాలజీకి మారినప్పటికీ ఇదే నంబర్ ను కొనసాగించుకోవచ్చు. మరొక మాట చెప్పాలంటే వినియోగదారుడు సిడిఎంఎ నుంచి జిఎస్ఎంకు మారవచ్చు.
ఇది ఆపరేటర్ల మధ్య పోటీని పెంచవచ్చు. వారి సేవల నాణ్యతను మెరుగుపరిచేందుకు దోహదం చేయవచ్చు. ఆపరేటర్లకు రూ. 19 కన్నా తక్కువగా లేదా అదే స్థాయిలో చార్జీ వసూలు చేసేందుకు స్వేచ్ఛ ఉంటుందని ట్రాయ్ ఒక ప్రకటనలో తెలియజేసింది. ప్రతి మెసేజ్ ను పొందుపరిచేందుకు ఎంఎన్ పి సర్వీస్ ప్రొవైడర్ కు ఒక ఏక్సెస్ ప్రొవైడర్ లేదా అంతర్జాతీయ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్ చెల్లించే డిప్పింగ్ చార్జీలను టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్లు, ఆయా ఎంఎన్ పి సర్వీస్ ప్రొవైడర్లు పరస్పర సంప్రదింపులు జరిపి తేల్చుకుంటారని సంస్థ తన ప్రకటనలో వివరించింది.
అక్టోబర్ లోనే దేశంలో ఎంఎన్ పి ని ప్రవేశపెట్టాలని తొలుత సంకల్పించారు. ట్రాయ్ మార్గదర్శక సూత్రాల ప్రకారం, ప్రస్తుత సర్వీస్ ప్రొవైడర్ నుంచి మరొక సర్వీస్ ప్రొవైడర్ కు మొబైల్ నంబర్ మార్పు లేదా పోర్టింగ్ ప్రక్రియను గరిష్ఠంగా నాలుగు రోజుల లోగా పూర్తిచేయాలి. కాగా, టెలికాం రంగంలో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు జరగవచ్చు. లాభదాయక వినియోగదారులతో సంబంధాలు నెలకొల్పుకోవడం కోసం చూస్తున్న కొత్త లైసెన్సీలకు ఈ చర్యను ఒక అవకాశంగా పరిగణిస్తున్నారు. ఇక అంతగా లాభదాయకం కాని వినియోగదారులను వదిలించుకొనేందుకు ఇదే అవకాశమని ప్రస్తుత ఆపరేటర్లు కూడా భావిస్తున్నారు.
Pages: 1 -2- News Posted: 21 November, 2009
|