దుబాయి ప్రకంపనలు
న్యూఢిల్లీ : ఒక్కసారిగా పగిలిపోయిన దుబాయి ఆర్ధిక వ్యవస్థ బుడగ భారత్ తో సహా ప్రపంచదేశాలను కలవరపరుస్తోంది. ఆర్ధిక వ్యవస్థలను కుదిపేస్తోంది. స్టాక్ మార్కెట్ లు కుప్పకూలుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ దుబాయ్ వరల్డ్ ఉన్నట్టుండి పేల్చిన బాంబు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనాలు సృష్టిస్తోంది. తమ ద్రవ్యలోటును పునర్వ్యవస్థీకరించుకోవాల్సి ఉందని, అందువలన రుణదాతలు ఆరు నెలలపాటు వేచి ఉండాలని ప్రకటించి ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలను నిర్ఘాంతపరచింది. ప్రస్తుత అంచనాల ప్రకారం దుబాయి వరల్డ్ 59 బిలియన్ అమెరికన్ డాలర్ల లోటును ప్రకటించింది. అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రెండు లక్షల 90 వేల కోట్ల రూపాయలు. రియల్ ఎస్టేట్, మౌలికసదుపాయాలు, వస్తు సరఫరా, ఆర్ధిక మండళ్ల వ్యాపారాలను నిర్వహించే వివిధ కంపెనీల సముచ్ఛయంగా దుబాయ్ వరల్డ్ ఉంది. దీనిలో భారత్ తో సహా అనేక దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. వివిధ ఆర్ధిక సంస్థలు పెద్ద మొత్తాలను దుబాయ్ వరల్డ్ లో పెట్టబడులుగా రుణాలను అందచేశారు.
దుబాయ్ వరల్డ్ దెబ్బకు ఆర్ధిక లావాదేవీలు నెమ్మదించాయి. ప్రపంచంలోని ఇతర దేశాలలో మాదిరిగానే ఇండియాలో స్టాక్ మార్కెట్ శుక్రవారం నాడు పతనానికి గురైంది. సన్సెక్స్ ట్రేడింగ్ ఆథోముఖంగా సాగింది. ఒక దశలో ఏకంగా ఆరువందల పాయింట్లు నష్టపోయిన సన్సెక్స్ రోజు వ్యాపారం ముగించే సరికి 222.92 పాయింట్ల నష్టం వద్ద ఆగింది. 16,632.01 పాయింట్ల వద్ద వ్యాపారం ముగిసింది. రియల్టర్, బ్యాంకులు, ఐటి రంగాల షేర్లు వత్తిడికి గురయ్యాయి. దుబాయి కంపెనీలతో వ్యాపార లావాదేవీలు సాగిస్తున్న భారత రియల్టీ కంపెనీలు దెబ్బతింటాయన్న భయం ముసురుకుంది. అలానే గల్ఫ్ ప్రాంతం నుంచి రాబడులు కూడా ఆగిపోతాయన్న అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే గల్ఫ్ ప్రాంతంలో పనిచేస్తున్న లక్షలాది మంది భారతీయులు ప్రతీరోజు కోట్ల డాలర్లను ఇక్కడకు జమ చేస్తూ ఉంటారు.
Pages: 1 -2- News Posted: 27 November, 2009
|