ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) తన ట్రెజరీ స్టాక్ (షేర్ల)లో కొంత భాగాన్ని 2675 కోట్ల రూపాయలకు సోమవారం విక్రయించింది. నాలుగు నెలలలోపే ఈ సంస్థ ఇటువంటి లావాదేవీ జరపడం ఇది రెండవ సారి. ఒక ట్రస్ట్ అధీనంలోని ఈ షేర్ల అమ్మకం ద్వారా సమీకరించిన మొత్తాన్ని నెదర్లాండ్స్ లోని పెట్రో కెమికల్స్ కంపెనీ లైయన్ డెల్ బాసెల్ కొనుగోలు కోసం వినియోగించనుంది. దీని కోసం సిద్ధం చేస్తున్న అత్యవసర నిధిలోకి ఈ మొత్తాన్ని సంస్థ జమ చేస్తుంది.
ఆర్ఐఎల్ 258.50 లక్షల ట్రెజరీ షేర్లను ఒక్కొక్కటి రూ. 1035 రేటుకు విక్రయించింది. ఈ షేర్లకు సంబంధించిన డిసెంబర్ 31 నాటి ముగింపు ధరలో 5 శాతం డిస్కౌంట్ తో వీటిని సంస్థ విక్రయించింది. సోమవారం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజిలోఆర్ఐఎల్ షేర్ల విలువ 1.29 శాతం మేర తగ్గి రూ. 1075 పలికింది. అతి పెద్ద దేశీయ సంస్థ ఎల్ఐసి మొత్తం 258.50 లక్షల ఆర్ఐఎల్ షేర్లను కొనుగోలు చేసింది. బిఎస్ఇ డేటా ప్రకారం 2009 సెప్టెంబర్ 30 నాటికి ఎల్ఐసి 6.04 శాతం వాటాలతో ఆర్ఐఎల్ లో అతి పెద్ద సంస్థాగత వాటాదారుగా ఉంది.
ఆర్ఐఎల్ తన వాటాలను సెప్టెంబర్ లో ఒక ఇన్వెస్టర్ల బృందానికి విక్రయించడం ద్వార రూ. 3188 కోట్లు సమీకరించిన విషయం విదితమే. ట్రెజరీ స్టాక్స్ పై అజమాయిషీ ఉన్న పెట్రోలియం ట్రస్ట్ ను ఆర్ఐఎల్ 2002లో ఏర్పాటు చేసింది. రిలయన్స్ పెట్రోలియం (ఆర్ పిఎల్)ను తనలో విలీనం చేసుకున్న తరువాత ఈ ట్రస్ట్ ను ఆర్ఐఎల్ ఏర్పాటు చేసింది. ఆర్ పిఎల్ తొలి ఆయిల్ రిఫైనరీను గుజరాత్ జామ్ నగర్ లో ఏర్పాటు చేసింది. ఆర్ఐఎల్ అనుబంధ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ హోల్డింగ్స్ సంస్థ ఈ ట్రస్టు ద్వారా లబ్ధి పొందుతున్నది.