చేదెక్కిన చక్కెర
న్యూఢిల్లీ : రీటైల్ మార్కెట్ లో ప్యాకేజ్డ్ చక్కెర ధర ఇప్పుడు కిలో రూ. 46 మేరకు ఉన్నది. ఈ ధర తగ్గే సూచనలు కనిపించడం లేదు. విడిగా అమ్మే చక్కెర ధర కూడా కిలో 43, 44 రూపాయల మధ్యలో ఉంటుండడంతో పోలిథిన్ ప్యాకెట్ లో చక్కెర ధర కిలో 50 రూపాయల దిశగా పరుగులు పెడుతున్నది. ఈ ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం కూడా నిస్సహాయ స్థితిలో పడినట్లున్నది.
క్రితం సంవత్సరం ద్వితీయార్ధం నుంచి చక్కెర ధరలు క్రమంగా పెరగసాగాయి. ఉత్పత్తి లోటుకు తోడు క్రిస్మస్, కొత్త సంవత్సరం సీజన్ కూడా ఈ ధరల పెరుగుదలకు కారణమవుతోంది. ప్రభుత్వం వద్ద ఇప్పుడు ఉన్న చక్కెర నిల్వలు నెలవారీ అవసరాలు తీర్చడానికే సరిపోతాయి. ముఖ్యంగా ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) వినియోగదారుల అవసరాలనే ఇవి తీర్చగలవు. ధరలను నియంత్రించడానికి విడుదల చేయాలంటే అదనపు నిల్వలు కూడా లేవు.
అధికార వర్గాల సమాచారం ప్రకారం, చక్కెర దిగుమతి ప్రభుత్వం ఇంతవరకు విముఖంగా ఉన్నది. అయితే, ప్రైవేట్ సంస్థలకు మాత్రం చక్కెర దిగుమతి చేసుకునే స్వేచ్ఛ ఉన్నది. ప్రజల ముఖ్య ఆహారమైన బియ్యం దిగుమతికే ప్రభుత్వం ఇష్టపడనప్పుడు చక్కెర సంగతి అడగనక్కర లేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అంటే వినియోగదారులు ఎక్కువ ధరలతో సర్దుకుపోవలసి ఉంటుందన్నమాట. అంతర్జాతీయ విపణిలో ధరలు బాగా ఎక్కువగా ఉండడం వల్ల చక్కెర దిగుమతికి అవరోధం ఏర్పడుతున్నది. ఇండియాలో చెరకు పంట వైఫల్యంతో పాటు బ్రెజిల్ లో కూడా పంట దెబ్బ తిన్నది. ఇండియాలో అనావృష్టి వల్ల పంటకు నష్టం వాటిల్లగా బ్రెజిల్ లో అతివృష్టి వల్ల పంట దెబ్బ తిన్నది.
దిగుమతి సుంకాలను శూన్యం చేసినప్పటికీ విదేశాల నుంచి తెప్పించుకున్న సరకు ధర ప్రస్తుత రీటైల్ ధరల కన్నా అధికంగానే ఉన్నది. ఇక్కడ విచిత్రమేమిటంటే, రీటైల్ ధరలు మరింత పెరిగితేనే రీటైలర్లు, స్టాకిస్టులకు చక్కెర దిగుమతి ఆర్థికంగా గిట్టుబాటు అవుతుంది. తానే చక్కెర దిగుమతి చేసుకుని నియంత్రిత ధరకు సరకును విడుదల చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు. అంటే ప్రజలు ఈ బాధ భరించవలసి ఉంటుందని అధికారి ఒకరు అన్నారు.
Pages: 1 -2- News Posted: 7 January, 2010
|