ఊరూరా 'టాటా' హోటళ్లు
ముంబై : బడ్జెట్ హోటల్ రంగంలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని గ్రహించిన టాటా గ్రూపు తమ సకల సదుపాయాల హోటల్ చైన్ జింజర్ తరఫున నాలుగు సంవత్సరాలలో దేశంలో 50 హోటళ్లను నిర్మించాలని యోచిస్తున్నది. టాటా గ్రూపునకు చెందిన లిస్టెడ్ ఆతిథ్య (హాస్పిటాలిటీ) సంస్థ ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్ సిఎల్) తన అనుబంధ సంస్థ రూట్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్ సిఎల్) ద్వారా దేశంలో 20 జింజర్ హోటళ్లను నడుపుతున్నది.
'దేశంలో టూరిస్టుల రాకపోకలు ముమ్మరం అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మూడు నాలుగేళ్లలో 70 హోటళ్లు, లేదా అంతకుమించిన సంఖ్యలో నిర్మించాలని మా ఆకాంక్ష. అందువల్ల హోటల్ కు సగటున 100 గదులు వంతున ఈ వ్యవధిలో మా పరిధి 7000 గదుల వరకు విస్తరించగలదు' అని ఆర్ సిఎల్ సిఇఒ ప్రభాత్ పాణి తెలియజేశారు. ఇందు కోసం మాతృ సంస్థ ఐహెచ్ సిఎల్ నుంచి రుణం, ఈక్విటీ ద్వారా మూల ధనాన్ని సమీకరించగలమని ఆయన చెప్పారు. తమ సంస్థ ప్రస్తుతం చెన్నై, సూరత్, ఇండోర్, తిరుప్పూర్, మణెశార్, లక్నో నగరారలో హోటళ్ల నిర్మాణం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.
'ప్రస్తుతం బడ్జెట్ కేటగరీలో హోటళ్ల స్థాపన తక్కువగా జరుగుతోంది. ఈ రంగంలో ఎక్కువ మంది లేరు. అందువల్ల అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయి. 2011 నాటికి ప్రధాన భారతీయ నగరాలలో దాదాపు 25 వేల కొత్త ఉన్నత శ్రేణి రూముల నిర్మాణం జరగవచ్చునని భావిస్తున్నాం. మధ్య శ్రేణి, బడ్జెట్ రంగాలలో సుమారు 18 వేల గదులు రావచ్చు' అని పాణి పేర్కొన్నారు.
Pages: 1 -2- News Posted: 11 January, 2010
|