'బాష్'కు చైనా నకిలీలు
న్యూఢిల్లీ : మోటారు వాహనాల విడి భాగాలను తయారు చేసే ప్రముఖ కంపెనీ బాష్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అదీ అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న 'ఆటో ఎక్స్ పో 2010' ప్రదర్శనలోనే చైనా కంపెనీలు తయారు చేసిన నకిలీ ఆటో విడిభాగాలను ప్రదర్శించారు. వాటిపై 'బాష్' కంపెనీ తయారీ లేబుల్ వేసిన చైనా కంపెనీ తెగింపు బాష్ ప్రతినిధులను ఆశ్చర్యానికి గురిచేసింది. బెంగళూరుకు చెందిన ఉత్పత్తి సంస్థ బాష్ లిమిటెడ్ తయారీవనే ముసుగులో నకిలీ ఆటో విడిభాగాలు ఢిల్లీ ప్రగతి మైదాన్ లో జరిగిన 'ఆటో ఎక్స్ పో 2010'లో బయటపడ్డాయి. చైనా పెవిలియన్ స్టాల్ లో ఈ నకిలీ విడిభాగాలు ప్రదర్శించారు. 5000 చదరపు మీటర్ల విస్తీర్ణమున్న చైనా పెవిలియన్ లో పెక్కు చైనీస్ విడిభాగాల ఉత్పత్తి సంస్థలకు చెందిన స్టాల్స్ ఉన్నాయి. బాష్ తయారు చేసినవిగా పేర్కొంటున్న నకిలీ అధునాతన లైటింగ్ ఉత్పత్తులు ఇటీవల బాష్ సంస్థ అధికారుల కంట పడ్డాయి.
ఇందుకు బాధ్యులైన చైనీస్ ఎగ్జిబిటర్ పై తాము చర్య తీసుకుంటున్నట్లు సంస్థ అధికారులు వెల్లడించారు. అయితే, వారు ఇతర వివరాలు తెలియజేయలేదు. మరి పోలీసుల వద్ద గాని, ఏ ఇతర ప్రాధికార సంస్థ వద్ద గాని ఏదైనా కేసు నమోదు చేశారా అనేది నిర్థారితం కాలేదు. 'ఇది నకిలీ తయారీ మాత్రమే కాదు. ఇక్కడ ప్రదర్శించిన ఉత్పత్తి లైటింగ్ సిస్టమ్ లకు సంబంధించినవి. ఇవి ఒక వాహనం నుంచి అత్యంత శక్తిమంతమైన కాంతి రేఖలను వెలువరిస్తాయి. ఇటువంటివి మేము ఉత్పత్తి చేయడం లేదు. ఏ కారుకైనా ఇటువంటి అధిక శక్తిమంతమైన లైట్లు అపాయకరం. ఇది బాష్ బ్రాండ్ ను దుర్వినియోగం చేయడమే' అని బ్రాండ్ ప్రొటెక్షన్ మేనేజర్ వి. సదానందం పేర్కొన్నారు.
అత్యంత కాంతిమంతమైన రేఖ (హై ఇంటెన్సిటీ బీమ్)లు వెలువడడం ఇటు పాదచారులకు, అటు ఎదురుగా వచ్చే వాహనాలకు ప్రమాదకరమని, శక్తిమంతమైన లైటింగ్ వల్ల కళ్లు మూసుకుపోతాయని బాష్ అధికారులు చెబుతున్నారు. 'ఇది వాహనానికి కూడా చేటే. ఎందుకంటే లైటింగ్ కోసం హై ఇంటెన్సిటీ బీమ్ కు అత్యధిక శక్తి అవసరమవుతుంది. వాహనంలో ఏమాత్రం షార్ట్ సర్క్యూట్ ఏర్పడినా మొత్తం కారు పేలిపోతుంది. మేము ఎగ్జిబిటర్ స్టాల్ లో కేవలం ఒక కిట్ ను స్వాధీనం చేసుకున్నాం. నగరంలో ఇంకా ఎన్ని కన్సైన్ మెంట్ లు నిల్వ ఉన్నాయో మాకు తెలియదు' అని వారు చెప్పారు.
Pages: 1 -2- News Posted: 12 January, 2010
|