వడ్డీ రేట్లు పెరగవచ్చు
ముంబై : అప్పు చేసి భారీ మొత్తంలో ఏవైనా కొనుగోళ్లు చేయాలనుకుంటున్న వారు వచ్చే మూడు మాసాల్లోపల ఆ పని చేయడం ఉత్తమం. ఎందుకంటే వడ్డీ రేట్లు వచ్చే సంవత్సర కాలంలో దాదాపు ఒక శాతం మేర పెరిగే అవకాశం ఉందని బ్యాంకర్లు సూచిస్తున్నారు. ద్రవ్యోల్బణం గురించి ఆందోళన చెందుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) తెలియజేసింది. ద్రవ్యోల్బణం మరింతగా పెరగవచ్చునని ఆర్ బిఐ సూచించింది. అయితే, వడ్డీ రేట్లను హెచ్చించాలన్న సూచనను బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ నేరుగా పంపలేదు.
ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థలో అత్యధికంగా నగదు అందుబాటులో ఉంది. (ద్రవ్య సరఫరా అధికంగా ఉందని అర్థం) దీనితో ధరలు ఇంకా పైపైకి ఎగబాకవచ్చు. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుండడమే దీనికి కారణం. ఈ వ్యవస్థలో అత్యధిక స్థాయిలో ఉన్న ద్రవ్య సరఫరాను నియంత్రించడమే ఆర్ బిఐ చర్యలోని ఆంతర్యం. అయితే, ఆ దిశలో సాగతున్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని లక్ష్యం చేసుకోవచ్చు.
'ఆర్ బిఐ ఇప్పుడు సిఆర్ఆర్ ను హెచ్చించడం యథాలాప చర్యే' అని హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ ఎకనమిస్ట్ అభీక్ బారువా వ్యాఖ్యానించారు. రెపో, రివర్స్ రెపో రేట్లను హెచ్చించడం తీవ్ర ప్రభావాన్ని చూపే చర్య కాగలదు' అని ఆయన పేర్కొన్నారు. రానున్న 12 మాసాలలో ఈ రేట్లు ఒక శాతం మేర పెరగవచ్చునని ఆయన ఊహిస్తున్నారు. ఆర్ బిఐ బ్యాంకులకు డబ్బు అప్పుగా ఇచ్చే రేటే రెపో రేటు. ఆర్ బిఐ వద్ద జమ చేసిన డబ్బుపై బ్యాంకులు ఆర్జించే వడ్డీయే రివర్స్ రెపో రేటు. ఏప్రిల్ లో ప్రకటించనున్న పరపతి విధానంలో ఈ రేట్ల హెచ్చింపు జరగవచ్చునని బారువా ఊహిస్తున్నారు.
Pages: 1 -2- News Posted: 30 January, 2010
|