టాటా స్టీల్ భారీ విస్తరణ
ముంబై : దేశంలో అతి పెద్ద ఉక్కు ఉత్పత్తి సంస్థ టాటా స్టీల్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో విస్తరణ ప్రాజెక్టులపై రూ. 5700 కోట్లు వెచ్చించనున్నది. ఇందులో సుమారు 70 శాతం (రూ. 3700 కోట్లు) మొత్తాన్ని దేశంలో విస్తరణకు కేటాయిస్తుంది. జంషెడ్పూర్ లో ఉత్పత్తి సామర్థ్యాన్ని 6.8 మిలియన్ టన్నుల నుంచి 2011 ఆగస్టుకల్లా 10 మిలియన్ టన్నులకు పెంచాలన్నది టాటా స్టీల్ సంకల్పంగా ఉంది. ఈ విస్తరణకు వీలుగా రానున్న రెండేళ్లలో దేశంలో వార్షిక ఇనుప ఖనిజం ఉత్పత్తిని 55 శాతం మేర అంటే 17 మిలియన్ టన్నులకు సంస్థ పెంచుతున్నది. ఇందు కోసం సంస్థకు రూ. 1100 కోట్లు ఖర్చు కావచ్చునని అనుకుంటున్నారు. ముడిసరకు ధరలలో వ్యత్యాసాల నుంచి జంషెడ్పూర్ ఫ్యాక్టరీని కాపాడడం ఈ పథకం లక్ష్యం.
విదేశాలలోని తన ప్రాజెక్టులలో కెనడా, మొజాంబిక్ దేశాలలోని ఇనుప ఖనిజం, బొగ్గు గనులను రెండు సంయుక్త సంస్థల ద్వారా అభివృద్ధి చేయాలని టాటా స్టీల్ సంస్థ యోచిస్తున్నది. థాయిలాండ్ లోని తన అనుబంధ సంస్థ కింద మినీ బ్లాస్ట్ ఫర్నేస్ ను ఏర్పాటు చేయాలని కూడా సంస్థ యోచిస్తున్నది. ఈ పథకాలకు నిధుల కోసం రైట్స్ జారీ చేయాలని సంస్థ యోచిస్తున్నది. అయితే, ఈ విధంగా సమీకరించిన నిధులలో కొంత మొత్తం తన రుణాన్ని తిరిగి చెల్లించడానికి వినియోగించవచ్చు. టాటా స్టీల్ సంస్థకు, యూరోపియన్ అనుబంధ సంస్థకు ఈ సంవత్సరం మార్చి 31 నాటికి మొత్తం రూ. 26946 కోట్ల మేరకు రుణ భారం ఉంటుంది. అంటే సంస్థ అప్పు, ఈక్విటీ నిష్పత్తి 1:78గా ఉన్నది.
Pages: 1 -2- News Posted: 30 January, 2010
|