ఏసీలు మండుతాయ్
ముంబాయి : ఏసీలు మండిపోనున్నాయి. టీవీలు పేలిపోనున్నాయి. ఫ్రిజ్ లు ఇక షాక్ కొట్టనున్నాయి. ఏంటీ వరుస షాక్ లు అనుకుంటున్నారా..? మరేం కాదు రేపు వేసవిలో వీటిలో ఏది కొనలన్నా మీ జేబుకు చిల్లులు పడటం ఖాయం. గృహోపకరణ వస్తువుల ధరలు మరింతగా పెరగటమే ఇందుకు కారణం. ఈ మేరకు ఉత్పత్తి సంస్థలన్నీ తమపై పడుతున్న భారాన్ని వినియోగదారులపై మోపేందుకు సిద్ధమవుతున్నాయి. ఆర్ధికమాంద్యం బూచిని చూపి ఇప్పటికే ధరలను పెంచేసిన వాణిజ్య వర్గాలు బడ్జెట్ కు ముందే మరోసారి ధరల బాదుడు తప్పదంటూ సంకేతాలిస్తున్నాయి. కేంద్ర బడ్జెట్ లో ఉద్దీపనలను పునరుద్ధరించకపోతే గృహోపకరణాల ధరలు పెంచేందుకు ఆయా సంస్థలు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు బడ్జెట్ లో ప్రభుత్వం పన్నుల భారం కూడా మోపితే ఇక ఉత్పత్తుల ధరలతో వినియోగదారుల వీపు విమానం మోత మోగించక తప్పదని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ లో ఉద్దీపనల పునరుద్ధరణ లేకున్నా, పన్నుల భారం ఉంటే టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు వంటి ఉత్పత్తులు మరింత ప్రియం కావడం ఖాయమని తెలుస్తోంది.
గృహోపకరణాల ఉత్పత్తికి స్టీల్, కాపర్, అల్యూమినియంలతో పాటు వివిధ రసాయనాలను సంస్థలు వినియోగిస్తుంటాయి. ఆర్ధిక మాంద్యం నెలకొన్న నేపథ్యంలో వీటి ధరలు భారీగా పెరిగిపోయాయి. స్టీల్ ధర 25 నుండి 30 శాతం, పాలిమర్స్ ధర 25 శాతం, కాపర్, అల్యూమినియంలతో పాటు ఇతర రసాయనాల ధరలు 15 నుండి 20 శాతం వరకూ పెరిగాయి. ఉత్పత్తి సంస్థలపై పెరిగిన ధరల భారం భారీగా పడింది. వస్తువులను ఉత్పత్తి చేయడానికి వాటిని విక్రయించే ధరలో 60 నుండి 70 శాతం ముడిసరుకు కొనుగోలుకే సరిపోతోందని ఆయా సంస్థలు వాపోతున్నాయి. అందుకే పలు సంస్థలు గృహోకరణ వస్తువుల ధరలను ఇటీవల పెంచేశాయి.
Pages: 1 -2- News Posted: 17 February, 2010
|