'ఎయిర్ షో' టేకాఫ్
హైదరాబాద్ : నగర గగనతలంలో రకరకాల విమానాల సందడి మొదలైంది. 'ఏవియేషన్ 2010' కోసం రెండురోజుల నుంచి ఈ విమానాలు రిహాల్సిల్స్ వేస్తున్నాయి. రంగులను వెదచల్లుతూ విన్యాసాలను ప్రదర్శిస్తున్నాయి. మరో రోజులో నగర ప్రజలను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తే అంతర్జాతీయ వేడుక జరగబోతోంది. బేగంపేట ఎయిర్ పోర్టు ముస్తాబవుతోంది. పౌర విమానయానంపై అంతర్జాతీయ ఎగ్జిబిషన్, మహాసభ 'ఇండియా ఏవియేషన్ 2010' నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఇది బుధవారం హైదరాబాద్ లో ప్రారంభం కానున్నది. పౌర విమానయాన మంత్రిత్వశాఖ, భారత వాణిజ్య, పారిశ్రామిక మండలుల సమాఖ్య (ఫిక్కీ) సంయుక్తంగా రెండవ సారి నిర్వహిస్తున్న ఈ ఎగ్జిబిషన్ లో పౌర విమానయాన రంగంలోని ప్రసిద్ధ సంస్థలు పాల్గొంటున్నాయి.
బేగంపేట విమానాశ్రయంలో ఐదు రోజుల పాటు (మార్చి 3 నుంచి 7 వరకు) జరిగే ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్, పౌర విమానయాన పరిశ్రమపై మహాసభ, సిఇఒల ఫోరమ్, గగన యానం, కస్టమర్ డిమాన్ స్ట్రేషన్ ఫ్లైట్లు, స్టాటిక్ డిస్ ప్లే, మీడియా గోష్ఠులు ఉంటాయి.
ఇండియాలో వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించే ఈకార్యక్రమంలో 200 పైగా కంపెనీలు అత్యంత ఆధునిక ప్రపంచ ఏరోస్పేస్ టెక్నాలజీని ప్రదర్శిస్తాయి. 2008 అక్టోబర్ లో ఇదే వేదికలో జరిగిన మొదటి ఎగ్జిబిషన్ లో వలె ఎయిర్ బస్, బోయింగ్, సెస్నా, బెల్, బొంబార్డియర్ వంటి భారీ సంస్థలు తమ ఉత్పత్తులను, సర్వీసులను ప్రదర్శిస్తాయి.
Pages: 1 -2- News Posted: 2 March, 2010
|