గుండెలు 'మేసిన' బంటు!
ముంబాయిః ఒక్క గుండెతోనే అతిగా ప్రవర్తించేవాళ్లని 'గుండెలు తీసిన బంటు' అని అంటుంటారు. ఎనభయ్యేడేళ్ల రాందాస్ గారిని 'ఉక్కుగుండె మనిషి' అని ఆయనకి వైద్యంచేసే డాక్టర్ పిలుస్తారు. దక్షిణ ముంబాయికి చెందిన వ్యాపారి రాందాస్ కు ఇంతవరకూ పన్నెండుసార్లు కృత్రిమ గుండెను అమర్చారు. గత శనివారంనాడు 45 నిముషాల సేపు జరిగిన ఆపరేషన్ లో పన్నెండో స్టెంట్ ను అమర్చారు. మన దేశంలో అత్యధిక హార్ట్ స్టెంట్ లు అమర్చుకున్న రోగులలో రాందాస్ ఒకరని ఆపరేషన్ చేసిన డాక్టర్ బికె గోయల్ చెప్పారు. '1991లో బైపాస్ సర్జరీ తరువాత, 2001, 2009 మధ్య ఆరు ఏంజియోప్లాస్టీలు ఆయనకు జరిగాయి. ఈ ఆపరేషన్ల సమయంలోనే ఆయన సిర (రక్తనాళాలు)లలో స్టెంట్ లను అమర్చడం జరిగింది' అని బొంబాయి హాస్పిటల్ కార్డియాలజీ విభాగం డైరక్టర్ అయిన డాక్టర్ గోయల్ వివరించారు.
దాస్ కు పొగతాగే అలవాటు లేదు. చక్కెర వ్యాధి కూడా లేదు. 1991లో, ఆయన అరవై తొమ్మిదో యేట గుండె నీరసంగా ఉన్నట్టు బయటపడడంతో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. పది సంవత్సరాల తరువాత హార్ట్ ఎటాక్ వచ్చింది. అప్పుడే ఏంజియోప్లాస్టీ చేసి, రెండు స్టెంట్ లు అమర్చారు. మరో రెండేళ్ల తరువాత, మూసుకుపోయిన మరో సిరలో నాలుగు స్టెంట్ లు అమర్చారు. ఆ తరువాత 2005లో రెండు, 2006లో ఒకటి, 2007లో ఇంకో రెండు స్టెంట్ లను అమర్చారు. విశేషం ఏమిటంటే, 'పన్నెండు స్టెంట్ లను అమర్చడం అసాధారణం. ఎందుకంటే అన్ని అమర్చే అవసరం వచ్చేవరకూ రోగి జీవించడం జరగదు. అంతేకాదు. ఒక్కో స్టెంట్ అమర్చడానికి లక్ష రూపాయల ఖర్చవుతుంది. ఆ లెక్కన ఈ రోగికి అయిన ఖర్చూ విపరీతమే. అదృష్టవంతుడు కాబట్టి, మొత్తం పదమూడున్నర లక్షల రూపాయలు ఖర్చుపెట్టగలిగినా, అన్ని పరికరాలు సవ్యంగా పనిచేస్తున్నాయి. అందుకే ఆయన్ని ఉక్కుగుండె మనిషి అని పిలుస్తాను' అన్నారు డాక్టర్ గోయల్.
News Posted: 9 February, 2009
|