పెటాకులవుతున్న పెళ్ళిళ్ళు!
చెన్నై: సనాతన సంప్రదాయాలను ప్రాణపదంగా చూసుకునే చెన్నై నగరంలో పెళ్ళి ముచ్చట తీరకముందే విడాకుల కోసం కోర్టుకు ఎక్కేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. యువతరంలో ముఖ్యంగా నిత్యం ఒత్తిడికి గురవుతుండే ఐటి ప్రొఫెషనల్స్ లో విడాకులు కోరుతున్న దంపతుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నది. చివరకు చిన్నపాటి సమస్యలపై కూడా వివాహ బంధాల విచ్ఛిత్తి జరుగుతోంది.
సనాతన సంప్రదాయల చెన్నై నగరంలో ఇప్పటి వరకు ఉన్నత వర్గాలకే విడాకులు పరిమితమైవుండేవి. విడాకులు తీసుకోవడం ఆయా కుటంబాలపై చెరగని మచ్చగా భావించే రోజులు గతించాయి. ఇప్పుడు మధ్య తరగతి వారు కూడా తమ వివాహాల రద్దును కోరుతూ న్యాయస్థానాలనుఆశ్రయిస్తున్నారని న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు.
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పతనం, ఆర్థిక స్వాతంత్ర్యం, అత్యంత వేగపూరిత జీవన సరళి, అహంభావాలు, విభేదాల పరిష్కార నైపుణ్యం కొరవడడం విడాకులకు తరచు కారణాలు అవుతున్నాయని వారు చెబుతున్నారు. చివరకు సరైన షర్ట్ లేదా సరైన రంగు చీర ఎంపిక చేయకపోవడం కూడా వివాహ బంధం విచ్ఛిత్తికి దారి తీస్తున్నదని వారంటున్నారు.
నగరంలోని కుటుంబ న్యాయస్థానాలలో నమోదైన విడాకుల కేసుల సంఖ్య 2006లోని 3374 నుంచి 2007లో 3874కు పెరిగాయి. క్రితం సంవత్సరం వరకట్నం, విడాకుల కేసులు నాలుగు వేల స్థాయిని దాటినట్లు కుటుంబ న్యాయస్థానం వర్గాలు వెల్లడించాయి. విడాకులు కోరుకుంటున్న వారిలో సుమారు 50 శాతం మంది 35 ఏళ్ళ లోపు వారు కావడం మరింత కలవరం కలిగిస్తున్నది. చెన్నైలో దాఖలైన విడాకుల కేసులలో దాదాపు 40 శాతం వరకు ఐటి\ఐటిఇఎస్ రంగంలోని ప్రొఫెషనల్స్, చిత్ర పరిశ్రమలోని వారు దాఖలు చేసినవే. దీనితో ఫ్యామిలీ కౌన్సెలర్లు, లాయర్లు విచ్ఛిన్నమవుతున్న వివాహ బంధాలను పునరుద్ధరించడంలో బిజీ అవుతున్నారు.
News Posted: 12 February, 2009
|