ప్రియునికి మృత్యు కానుక!
లక్నో: తాను ప్రేమిస్తున్నప్పటికీ తనను వివాహం చేసుకోవడానికి నిరాకరించిన ఒక వ్యక్తిని హత్య చేసినందుకు 26 సంవత్సరాల యువతిని, ఆమె తల్లిదండ్రులను మీరట్ లో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలియజేశారు. ఎంకామ్ విద్యార్థిని మమత, వ్యాపారవేత్త క్రిషన్ గుప్తా నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. శనివారం, ప్రేమికుల రోజున మమత ఇంటికి గుప్తా వెళ్ళాడని, అయితే, తనను వివాహం చేసుకోవలసిందని ఆమె కోరినప్పుడు తనకు ఇప్పటికే మరొక యువతితో వివాహం నిశ్చయమైందని చెప్పి అతను ఆమెను పెళ్ళి చేసుకోవడానికి నిరాకరించాడని మీరట్ ఎస్ పి రాకేష్ జాలీ తెలిపారు.
గుప్తా సమాధానానికి దిగ్భ్రాంతి చెందిన మమత నిబ్బరంగా ఉంటూనే అతనికి ఒక అద్భుత కానుక ఇవ్వబోతున్నానని చెప్పి కళ్ళు మూసుకోవలసిందిగా ఒత్తిడి చేసింది. అతను అలా చేసిన తరువాత అతనిని నోరు తెరవవలసిందని కోరి ఆమె క్రిమిసంహారక మందు ప్యాకెట్ ను 'సల్ఫాస్'ను అతని నోటిలోకి పోసింది. గుప్తా వాంతి చేసుకోవడం ప్రారంభించినప్పుడు మమత అక్కడి నుంచి నిష్క్రమించింది. ఆమె ఇంటికి బయట నుంచి తాళం వేసి వెళ్ళిపోయింది.
ఈ సంఘటన జరిగినప్పుడు ఇంటిలో లేని ఆమె తల్లిదండ్రులు ఇంటికి తిరిగి రాగానే కనిపించిన దృశ్యం చూసి దిగ్భ్రాంతి చెందారు. కాని వారు తేరుకుని పోలీసులను పిలిపించి గుప్తా ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. అయితే, పోలీసులు తరచి తరచి ప్రశ్నించినప్పుడు వారు నేరాన్ని ఒప్పుకున్నారు. మమత చాలా కాలంగా గుప్తా తీరు పట్ల అసంతుష్టితో ఉంటున్నదని, ఆత్మహత్య చేసుకోవడానికి క్రిమిసంహారక మందు తెచ్చుకున్నదని ఎస్్పి తెలిపారు. ఇప్పుడు మమతపై హత్యా నేరాభియోగాన్ని మోపారు.
News Posted: 16 February, 2009
|