వ్యాయామం కంటికి రక్ష
న్యూయార్క్: కరోరమైన వ్యాయామంతో దృష్టి కోల్పోవడాన్ని నివారించవచ్చని తాజా అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఈ అధ్యయనం కోసం 41 వేల మంది రన్నర్స్ ను ఏడేళ్ళపాటు అధ్యయనం చేశారు. కేటరాక్ట్స్, కండరాల క్షీణతల్లాంటి వయసుతో ముడిపడిన రుగ్మతలు వచ్చే ప్రమాదం వీరిలో తక్కువగా ఉన్నట్లు ఆ అధ్యయనం కనుగొంది. కఠోరమైన వ్యాయామం దృష్టి కోల్పోయే ప్రమాదాన్ని నివారిస్తుందని, త్వరగా కంటి జబ్బుల బారిన పడే ప్రమాదం నుండి ప్రజల్ని రక్షిస్తుందని అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎనర్జీ లారెన్స్ బెర్క్ లీ నేషనల్ లేబొరేటరీ ఆధ్యర్యంలో జరిగిన అధ్యయనం వెల్లడిస్తోంది.
నిరంతరం కంటి పరీక్షలు నిర్వహించుకోవడం కంటే, నిరంతరం కఠోరమైన వ్యాయామం చేయడంతో కంటి జబ్బులను చాలా శక్తివంతంగా నివారించగలమని బెర్కలీ ల్యాబ్స్ సైన్సెస్ డివిజన్ ఎపిడమాలజిస్టు పాల్ విలియమ్స్ తెలిపారు. కంటి రెటినా చుట్టూతా ఏర్పడిన ఆటంకం కారణంగా చూపు కోల్పోతాము. 65 ఏళ్లవారిలో సగానికి పైబడి కేటరాక్ట్ వ్యాధితో అమెరికాలో బాధపడుతున్నారు. వయసు మళ్లడంతో ముంచుకువచ్చే కండరాల పటుత్వ క్షీణత రెటినాను పాడు చేస్తుంది. దాంతో కంటి చూపును శాశ్వతంగా కోల్పోయే ప్రమాదముంది. 75 ఏళ్లు పైబడ్డ వారిలో దాదాపు 28 శాతం మంది ఇలాంటి రుగ్మతతో బాధపడుతున్నారు. ఒక మోస్తరు వ్యాయామం కంటే కఠోర వ్యాయామం వల్ల దృష్టి కోల్పోయే ప్రమాదాన్ని నివారించవచ్చని పరిశోధకులు తెలిపారు. పలు శారీరక రుగ్మతలకు, మానసిక రుగ్మతలకు వ్యాయామం చాలా ఉపయోగకరమని మనకు సుపరిచితమే. అయితే కఠోర వ్యాయామంతో కంటి చూపు కోల్పోవడాన్ని నివారించవచ్చని తాజా అధ్యయనాలు తెలియజేయడం విశేషం.
News Posted: 16 February, 2009
|