పిరికితనం పెంచే హార్మోన్
లండన్: హిరోలను తయారు చేయలేము, జన్మతః ఆ లక్షణాలు వస్తాయని ఒక తాజా అధ్యయనంలో వెల్లడైంది. కొంతమంది సహజ సిద్ధంగా దయాళువులుగానే పుడతారు.పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న నానుడిని ఈ అధ్యయనం మరోసారి శరీర శాస్త్రపరంగా నిరూపించింది. శరీరంలో స్రవించే కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ తేడాల వల్ల ఒక వ్యక్తి ధీరుడిగా లేదా పిరికివాడుగా తయారవుతాడు. వాస్తవంలో, సవాళ్లను ఎదుర్కొనే సమయంలో దైర్యవంతులకు కార్టిసోల్ హార్మోన్ అంత పెద్ద ఎత్తున స్రవించదు. అదే సమయంలో భీరువులకు (పిరికివాళ్లకు) కార్టిసోల్ ఎక్కువగా స్రవిస్తుందని ఆ అధ్యయనం వెల్లడించింది.
'ఎంతటి ఉద్విగ్న పరిస్థితుల్లో అయినా కొంత మంది చాలా ప్రశాంతంగా ఉంటారు. అలాంటి వారు ఉద్రిక్త వాతావరణంలో కూడా తమ పనులను చాకచక్యంతో నిర్వహించగలరు. కొంతమంది వ్యక్తుల్లో వత్తిడి వాతావరణంలో ఈ హార్మోన్లు అసాధారణ రీతిలో స్రవిస్తాయి. వారిలో స్రవించినంతగా సాధారణ ప్రజల్లో స్రవించదు' అని యేల్ విశ్వవిద్యాలయం ప్రముఖ పరిశోధకుడు డీన్ ఐకిన్స్ డైలీ మెయిల్ కు తెలిపారు. ఆ పరిశోధకుల బృందం సైనికులపై పలు అధ్యయనాలను నిర్వహించింది. చిత్రహింసల శిబిరాల్లాంటి ఉద్విగ్న వాతావరణంలో పలువురు సైనికుల్లో ఎలాంటి మార్పులు వస్తాయన్న విషయాల్ని ఈ బృందం అధ్యయనం చేసింది. ఉద్విగ్న వాతావరణంలో సైతం ప్రశాంతంగా ఉన్న సైనికుల్లో కార్టిసోల్ అతి తక్కువగా స్రవించినట్లు, ఉద్విగ్న హ్రార్మోన్ ప్రభావాన్ని తటస్థీకరించే న్యూరో పెప్టైడ్ 'వై' రసాయనం అధిక మోతాదులో స్రవిస్తున్నట్లు ఆ పరిశోధక బృందం వెల్లడించింది.
ఈ అధ్యయనం అమెరికా మిలటరీ దృష్టిని ఆకర్షించింది. ఈ అధ్యయన ఫలితాలను వినియోగించి సైనికుల ఎంపికను పకడ్బందీగా నిర్వహించేందుకు అమెరికా మిలటరీ యోచిస్తోంది. వాస్తవంలో, తగు కాక్ టైల్ సప్లిమెంట్స్ ను వినియోగించడం, స్టెరాయిడ్స్, మనసుకు వ్యాయామం లాంటి కార్యకలాపాలను చేపట్టి మొద్దులను హిరోలుగా మార్చవచ్చని ఆ పరిశోధక బృందం తెలిపింది. 'యుద్దంలో భయపడి అటు ఇటు తిరిగేవాళ్లు మాకవసరం లేదు. ఒక మంచి యుద్దవీరుడు భయపడకూడదని అమెరికా మిలటరీ భావిస్తోంది. అయితే బతకాలంటే భయపడాల్సిన అవసరముంది. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితిగా మనం చెప్పొచ్చు' అని ఐకిన్స్ తెలిపారు.
News Posted: 17 February, 2009
|