ఆమె 13 భయం మాయం
లండన్ : 13 అంకె పట్ల ఒక ఇంగ్లీష్ మహిళకు ఉన్న భయం 13న శుక్రవారం 13 గంటలు దాటిన తరువాత 13 నిమిషాలకు మగ శిశువుకు జన్మ ఇచ్చిన తరువాత పోయింది. మగ శిశువు ఐజాక్ లాయిడ్-జోన్స్ 6 పౌన్ల 7 ఔన్సుల బరువు ఉన్నాడు. ఈ రెండింటినీ కూడితే 13 అవుతుంది.
మొదటిసారిగా తల్లి అయిన నార్తాంప్టన్ కు చెందిన 31 సంవత్సరాల లూయిసీ ఇప్పుడు తాను 13ను తన అదృష్ట సంఖ్యగా పరిగణిస్తున్నట్లు వెల్లడించింది. శిశువు వీపు మీద 666 సంఖ్య కోసం చూడవలసిందని తన స్నేహితులు జోక్ చేసినందున తాను మొదట భయపడ్డానని ఆమె చెప్పింది.
చివరకు ఆమె భర్త 29 సంవత్సరాల ఆండ్రూ కూడా 'ఫ్రైడే ది థర్టీన్త్' హారర్ చిత్రంలోని పాత్ర పేరిట జాన్సన్ అని తన కుమారునికి మిడిల్ పేరును సూచించాడు కూడా. అయితే, లూయిసీ మాత్రం ఇక తనకు 13 అదృష్ట సంఖ్య కాగలదని చెపుతున్నది.
'ఐజాక్ పెరుగుతున్న కొద్దీ దీనిని గురించే అంతా మాట్లాడుకుంటారని నా నమ్మకం. మూఢవిశ్వాసం మరొక విధంగా కూడా పని చేయవచ్చు. ఇది మా విషయంలో సంభవించిన అత్యుత్తమ పరిణామం. ఇది శుక్రవారం 13' అని ఆమె పేర్కొన్నట్లుగా 'సన్' పత్రిక తెలియజేసింది. ఐజాక్ తనకు తరచూ రాత్రిపూట నిద్ర లేకుండా చేస్తున్నప్పటికీ చెడు ధోరణులు వేటినీ కనబరచలేదని ఆమె చెప్పింది.
News Posted: 21 February, 2009
|