పెళ్ళిళ్ళు కుదిర్చే కాలేజి!
షెడ్ పూర్: ఝార్ఖండ్ జంషెడ్పూర్ లోని ఒక ప్రముఖ మహిళా కళాశాల ఒక వినూత్న ప్రాజెక్టును చేపట్టింది. తమ కళాశాలలో విద్యార్థులకు విద్యా బోధన గరపడమే కాకుండా వారికి తగిన వరులను ఎంపిక చేసే బృహత్తరమైన బాధ్యతను కళాశాల నెత్తికెత్తుకుంది. అయితే, ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలనుకునే అమ్మాయిలు ముందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలని కళాశాల షరతు విధిస్తున్నది. క్రితం సంవత్సరం యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) స్వతంత్ర ప్రతిపత్తి మంజూరు చేసిన జంషెడ్పూర్ మహిళా కళాశాల వినూత్న రీతిలో 'స్వయంవర్' పేరుతో పెళ్ళి సంబంధాల కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేయబోతున్నది.
కాలేజీ ప్రిన్సిపాల్ శుక్లా మహంతి మదిలో మెదిలిన ఆలోచనే 'స్వయంవరం' ప్రాజెక్టు. కాలేజీ సోషియాలజీ విభాగంలోని ఆమె సహచరులు ఇందుకు విశేషంగా చేయూత ఇస్తున్నారు. విద్యార్థినులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత వారి తల్లిదండ్రులకు దీని వల్ల ఉపశమనం లభించగలదని వారు భావిస్తున్నారు. 'స్వయంవర్' కచ్చితంగా పెళ్ళిళ్ళ బ్యూరో మాత్రం కాదని, కాని కట్నం లేకుండా యువతులు జీవితంలో స్థిరపడడానికి దోహదకారిగా ఉంటుందని మహంతి 'పిటిఐ' విలేఖరితో చెప్పారు.
'విద్యార్థులకు విద్యను సమకూర్చే బాధ్యతను మేము చేపట్టుతున్నప్పుడు వారికి తగిన వరులను కూడా ఎంపిక చేసే బాధ్యతను మేము ఎందుకు తప్పించుకోవాలి' అని ఆమె అన్నారు. ముందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలనే షరతు వల్ల తల్లిదండ్రులు తమ కుమార్తెలను విద్యావంతులను చేసేందుకు పురికొల్పుతుందని శుక్లా మహంతి చెప్పారు.
News Posted: 23 February, 2009
|