లావెక్కడంలో రహస్యమిదే!
లండన్: కొంత మంది కడుపు నిండా తినక పోయినప్పటికీ లావెక్కుతుంటారు. మరికొందరు ఎడాపెడా తిన్నప్పటికీ లావెక్కకుండా సన్నగా, నాజూగ్గా ఉంటారు. వాళ్ల వంటి తీరు అంతేనని మన పెద్దవాళ్లు అనడం మనకు తెలుసు. దీన్ని బట్టి తినడానికి, లావెక్కడానికి మధ్య ఆందోళన కల్గించేంత స్థాయిలో సంబంధం లేదనిపిస్తుంది. సన్నబడటానికి కడుపు మాడ్చుకోవడం, జ్యూస్ లు తాగడం లాంటి కఠోరమైన డైటింగ్ పద్దతులు అనుసరించి నప్పటికీ లావు తగ్గలేదని ఆందోళన చెందనవసరం లేదు. ఊబకాయ రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఛేదించారు. మన జన్యువుల్లో 'కొవ్వును నియంత్రించే జన్యువు' ల్ని వారు కనుగొన్నారు. దాంతో బాగా తిన్నప్పటికీ కొంత మంది లావు కాకపోవడంపై గల అపోహలు తొలగిపోవడమే కాకుండా లావెక్కడం వెనక గల కారణం ఒక మేరకు బోధపడింది.
ప్రాథమిక అధ్యయనాల ప్రకారం బరువును పెంచే ఎఫ్ టిఓ జన్యువును జర్మనీ శాస్త్రవేత్తలు కనుగొనగల్గారు. జర్మనీ దుస్సెల్ డార్ఫ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం లావెక్కే జీవప్రక్రియను నియంత్రించే జన్యువును వెలికి తీశారు. ఈ జన్యువు లేని వ్యక్తులు వేగంగా లావెక్కుతారన్న సత్యాన్ని వారు కనుగొన్నారు. ఎలుకలపై పలు ప్రయోగాల్ని చేయడం ద్వారా ఆ శాస్త్రవేత్తలు ఈ జన్యువును విజయవంతంగా రాబట్టగల్గారు. సన్నగా నాజూగ్గా ఉన్న జీవుల్లో 'ఎఫ్ టిఓ' జన్యువు ఉన్నట్లు వారు కనిపెట్టారు.
శరీరంలో ఈ జన్యువును కలిగిన జీవులు సన్నగా ఉండడమే కాకుండా, కొంత మందకొడిగా కూడా ఉన్నట్లు ఆ అధ్యయనం వెల్లడించిందని 'నేచర్' జర్నల్ పేర్కొంది. ఈ అధ్యయన ఫలితం ఆధారంగా ఊబకాయ సమస్యకు సరికొత్త పరిష్కారాన్ని కనుగొనగల్గే అవకాశముందని పరిశోధకులు తెలిపారు. 'ఎఫ్ టిఓ కార్యకాలాపాన్ని రూపొందించగల్గే పలు మందుల తయారీకి ఈ పరిశోధనా ఫలితం ఉపయోగపడుతుంది. ఆహారం తీసుకోవడంపై, శక్తిని ఖర్చుచేయడంపై ఎఫ్ టిఓ తీవ్ర ప్రభావమేస్తుంది. మానవుల్లో దీని ప్రభావాన్ని లోతుగా పరిశీలించాల్సి ఉంది.'అని ఈ అధ్యయనంలో ప్రధాన శాస్త్రవేత్త ఉల్రిక్ రూథర్ డెయిలీ టెలిగ్రాఫ్ కు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎఫ్ టిఓ జన్యువును కనుగొనడం జరగలేదు. ఈ జన్యువు జిహ్వ చాపల్యాన్ని చంపి, ఆహారం తీసుకోవడాన్ని నియంత్రిస్తుంది. అయితే శరీరంలోని కేలరీలను ఖర్చు చేసే తీరు ఇప్పటికింకా నిర్ధారణ కాలేదు.
News Posted: 23 February, 2009
|