సైబీరియా యతి దొరికేనా?
కెమెరొవొ: 'యతి'కి సంబంధించిన జానపదుల కథనాలు ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రచారంలో ఉన్నాయి. చాలా కాలం నుండి శాస్త్రవేత్తలు సైతం ఇలాంటి ఒక జీవి కోసం అన్వేషణ చేస్తూనే ఉన్నారు. అయితే ఏవో కొన్ని ఆనవాళ్లు దొరికినప్పటికి, ఇప్పటికి జానపదుల కథనాల ఆధారంగానే యతిని ఊహాచిత్రాన్ని రూపొందించారు. హిమాలయ ప్రాంతాల్లో, సైబీరియా ప్రాంతాల్లో 'మంచు మనిషి' లేదా 'యతి' గా పిలిచే జీవి తిరుగు తున్న కథనాలు ప్రపంచ వ్యాప్తంగా పలువురు శాస్త్రవేత్తల్లో ఆసక్తిని రేకెత్తించాయి. సైబీరియాలోని షోరియా ప్రాంత పర్వత సానువుల్లో (దక్షిణ కెమెరొవొ ప్రాంతం) మంచు మనిషి లేదా యతి కి సంబంధించిన పలు స్థానిక కథనాలున్నాయి. కెమెరొవొ స్టేట్ విశ్వవిద్యాలయం నుండి అన్వేషణ బృందం వెళుతున్నట్లు దానికి సారధ్యం వహిస్తున్న ఎథ్నోగ్రాఫర్ వాలెరీ కిమెయేవ్ మంగళవారంనాడు ప్రకటించారు.
కెమెరొవొ ప్రాంతీయ పాలక కేంద్రానికి 500 కిలోమీటర్ల దూరంలో ఉండే 'అజస్ స్కయా గుహ' వద్ద మంచు మనిషిని చూసినట్లు స్థానికులు చెబుతున్నారు. అజస్ స్కయా గుహ వద్ద, మ్రాసు నది పరిసరాల్లో మంచు మనిషి లేదా యతిని చూసినట్లు షోరియా గ్రామాల ప్రజలు దాదాపు 14 లేఖల్ని తష్తగోల్ జిల్లా వ్లదిమీర్ మకుతా స్థానిక పాలన మండలికి రాసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తేల్చుకుందుకు ఒక శాస్త్రవేత్తల బృందాన్ని పంపుతున్నట్లు అధికారులు తెలిపారు.
యతి విషయాన్ని ధృవీకరించేందుకు గాని, ఖండించేందుకు గాని అన్వేషణ తప్పక చేపట్టాలని వారు తెలిపారు. స్థానికులు చెబుతున్న వర్ణనలను బట్టి 1.5-2 మీటర్ల పొడవు ఉండే 'బ్రౌన్ బేర్' కావచ్చని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎలుగుబంటి పాద ముద్రలను మంచుపై స్పష్టంగా చూసే అవకాశముందని వారు తెలిపారు. వాటి వంటి నిండా గాఢమైన ఎరుపు రంగులో ఉండే వెంట్రుకలుంటాయి. ఆ ఎలుగులు చాలా వేగంగా చెట్లపైకి ఎగబాక గలవని ఆ శాస్త్రవేత్తలు తెలిపారు.
News Posted: 24 February, 2009
|