13 ఏళ్ళకే 'మందు బాబు'లు!
న్యూఢిల్లీ : వివిధ రాష్ట్రాలలో మద్యం సేవనానికి అనుమతించే వయస్సు 18, 25 మధ్య ఉన్నప్పటికీ దేశంలో మద్యపానాన్ని ప్రారంభిస్తున్న వారి సగటు వయస్సు మరీ దిగ్భ్రాంతికర స్థాయిలో 13గా ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం ఇది 19గాను, రెండు దశాబ్దాల క్రితం 28గాను ఉన్నది. అధిక సంఖ్యలో టీన్ పిల్లలు మద్యపానాసక్తులు అవుతున్నారని, ఫలితంగా భవిష్యత్తులో ఆరోగ్యానికి తీవ్ర ముప్పు రాబోతున్నదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అన్బుమణి రామదాస్ బుధవారం లోక్ సభలో చెప్పారు. 'కొన్ని సంవత్సరాల క్రితం వరకు మద్యపానం ప్రారంభించడానికి సగటు వయస్సు 19గా ఉండేది. 1990 దశకంలో ఇది 28 సంవత్సరాలుగా ఉండేది. ఇప్పుడు ఇది 13.5కి తగ్గిపోయింది' అని మంత్రి ఒక ప్రశ్నకు సమాధానంగా తెలియజేశారు.
2002, 2008 సంవత్సరాల మధ్య దేశంలో బీర్ అమ్మకాలు 90 శాతం మేర పెరిగాయి. ప్రపంచంలో ఇదే అత్యధికం. చైనాలో 50 శాతం మేర, బ్రెజిల్ లో 20 శాతం మేర మాత్రమే ఈ అమ్మకాలు పెరిగాయి. భారతదేశంలో తలసరి మద్యం వాడకం 4 లీటర్ల మేరకు ఉన్నది. అమెరికా, బ్రిటన్ లలో కన్నా ఇది సగం ఉన్నది. ఆరోగ్య మంత్రిత్వశాఖ వద్ద గణాంక వివరాల ప్రకారం, రాష్ట్రాలలో కేరళ సాలీనా 8.3 లీటర్ల తలసరి మద్యం వినియోగంతో అగ్ర స్థానంలో నిలచింది. పంజాబ్ 7.9 లీటర్లు, హర్యానా 7.1 లీటర్లతో ఆతరువాతి స్థానాలు ఆక్రమించాయి.
'అన్ని ఆరోగ్య సమస్యలకూ మూల కారణం ఆల్కహాల్ అవుతున్నది' అని డాక్టర్ రామదాస్ చెబుతుండగా బిజెపి సభ్యులు జాతీయ మద్య ఆరోగ్య విధానం'నికి మద్దతుగా తమ బల్లలు మోదారు. 'మన భావి ఆరోగ్య సమస్యలను అదుపు చేయాలంటే మద్యం విధానాన్ని అనుసరించడం ఆవశ్యకం' అని డాక్టర్ రామదాస్ అన్నారు. మద్యపానాన్ని అదుపు చేయవలసిన ఆవశ్యకత గురించి మంత్రి నొక్కి చెబుతుండగా, స్పీకర్ సోమనాథ్ చటర్జీ జోక్యం చేసుకుంటూ 'మీరు మీ పరిధిని విస్తరిస్తున్నారు... మీ నియోజకవర్గంలో పొగాకు, ఆల్కహాల్ ఉత్పత్తిదారులు ఎందరు ఉన్నారో చూడండి' అని అన్నారు.
News Posted: 26 February, 2009
|