అంతరిక్షంలో 'దైవ నేత్రం'
లండన్: విశ్వం అతిశయోన్నతమైనది. మనిషి నిరంతరాయంగా, అనంతంగా విశ్వంలోని అద్భుతాలను వీక్షిస్తూనే ఉన్నాడు. తనదైన తీరులో దాన్ని వ్యాఖ్యానిస్తూనే ఉన్నాడు. విశ్వ రహస్యాలు సాపేక్షికంగా అర్ధమైన సందర్భంలో శాస్త్ర ప్రతిపత్తితోను, అర్థం కాని భాగాన్ని కల్పనతోను మనిషి వ్యాఖ్యానిస్తూనే ఉన్నాడు. అలాంటిదే విశ్వంలోని మరో అద్భుతానికి 'దైవ నేత్రం' (eye of God) గా పేరు పెట్టుకున్నాడు. విశ్వాంతరాళంలో ఒక పెద్ద కన్నులాంటి అద్భుతాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నెబ్యూలా వలె ఈ ఖగోళ బ్రహ్మాండం వెలుగులు విరజిమ్ముతూ కనిపించింది.
ఇంధనం ఖర్చైపోయి, శిధిలమై పోయిన ఒక కేంద్ర నక్షత్ర వాయువులు, ఆ నక్షత్ర ధూళితో కూడుకున్న ఒక పెద్ద కుహరం అలా కన్ను ఆకారంలో కనపడుతోందని 'న్యూసైంటిస్ట్' జర్నల్ వెల్లడించింది. 500 కోట్ల ఏళ్ల తర్వాత మన సౌర కుటుంబం కూడా అలా మారిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ 'దైవ నేత్రం' భూమి నుండి 700 కాంతి సంవత్సరాల దూరంలో 'అక్వారియస్' నక్షత్ర మండలంలో (constellation) ఉంది. దీన్ని 'హెలిక్స్ నెబ్యులా'గా ఔత్సాహిక ఖగోళవేత్తలు పిలుస్తున్నారు. ఇళ్ల వద్ద ఉన్న చిన్నపాటి టెలిస్కాపుల్లో ఈ అద్భుతం మసకమసకగా కనిపిస్తుంది. ఆకాశంలో ఈ దైవ నేత్రం పూర్ణ చంద్రునిలో నాల్గవ వంతు సైజులో ఉంటుంది.
నీలి రంగు కనుపాప, కన్నులోని తెల్లటి భాగంతో, మాంసపు రంగులోని కనురెప్పలతో ఈ దైవ నేత్రం చాలా ఘనంగా కనిపిస్తుంది. ఈ దైన నేత్రం చాలా పెద్దది. దీని ఒక చివరి నుండి మరో చివరకు ప్రయాణం చేసేందుకు కాంతికి రెండున్నరేళ్ల సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చిలీలోని లాసిల్లా పర్వత శిఖరంపై యూరోపియన్ సదరన్ అబ్సర్వేటరీ సంస్థ ఏర్పాటు చేసిన అతి పెద్ద టెలిస్కోప్ ద్వారా ఈ ఖగోళ విషయాన్ని శాస్త్రవేత్తలు కనుగొని ఫోటోలు తీశారు.
News Posted: 26 February, 2009
|