లాలూ దంపతులకు గుడి
న్యూఢిల్లీ: రైల్వే శాఖను లాభాల పట్టాలపై పరుగులెత్తించిన రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీదేవిలకు అభిమానులు గుడి కట్టించి తమ వీరాభిమానాన్ని, ప్రభుభక్తిని చాటుకోనున్నారు. రాజధాని నగరం పాట్నాకు 150 కిలోమీటర్ల దూరంలోని కైముర్ జిల్లాలోని ఒక గ్రామంలో ఈ గుడిని నిర్మించనున్నారు. 'ఆదివారం నాడు జరిగిన లాలూ-రబ్రీల గుడి భూమి పూజకు వందలాది మంది గ్రామస్తులు హాజరైనారు'అని ఆ గుడి నిర్మాణానికి ప్రధాన కారకుడు రాజేశ్వర్ యాదవ్ మంగళవారంనాడు తెలిపారు.
రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీ దేవీల నిలువెత్తు విగ్రహాలను ఈ గుడిలో ప్రతిష్టించనున్నారని రాజేశ్వర్ తెలిపారు. ఈ బీహార్ మాజీ ముఖ్యమంత్రుల గుడి నిర్మాణానికి గాను దాదాపు 54 లక్షల రూపాయలు ఖర్చవుతుందని రాజేశ్వర్ యాదవ్ తెలిపారు. గుడి నిర్మాణానికి తగిన భూమిని ఆ గ్రామ మహిళ దానం చేశారు.
News Posted: 3 March, 2009
|