భక్తి ముదిరి......
టోక్యో: భక్తి ప్రకోపించి పూజ కోసం దేవతామూర్తులను దొంగలించే ప్రబుద్ధుడు ఎట్టకేలకు క్యోటో పోలీసులకు దొరికిన ఉదంతం బుధవారంనాడు వెలుగుచూసింది. చెక్కతో చేసిన బుద్దుని ప్రతిమను దొంగలిస్తూ 59 ఏళ్ల ఇట్సువో ఏబ్ పోలీసులకు దొరికి పోయాడు. అనుమానం వచ్చిన పోలీసులు అతని ఇంటిని సోదా చేశారు. దాదాపు 21 బుద్ధ విగ్రహాలు అతని ఇంట్లో దొరికాయి. అత్యంత పురాతన నగరం క్యోటో బౌద్ద దేవాలయాలకు ప్రసిద్ధి. క్యోటోలోని పలు దేవాలయాల బుద్ధ విగ్రహాలను దొంగలించి ఇంట్లో పూజలు చేయడం ఏబ్ కు అలవాటుగా మారింది.
'ఈ విగ్రహాలకు పూజ చేసేందుకు నేను దొంగతనం చేశాను. 1202 శతాబ్దపు కెన్నింజి జెన్ దేవాలయానికి చెందిన 17 శతాబ్దపు 70 సెంమీ బుద్ద విగ్రహాన్ని సైతం దొంగలించాను. నాకు బుద్ద విగ్రహాలంటే ఇష్టం. వాటిని నా ఇంటికి తరలించి పూజలు చేస్తుంటాను' అని పోలీసు ఇంటరాగేషన్ లో ఏబ్ వెల్లడించాడు. ఏబ్ ఇంటిలోని ఒక గది బుద్ద విగ్రహాలతో కిక్కిరిసి ఉంది. విగ్రహాలన్నిటికి పూజచేసి, వాటి ముందు ఆపిల్, అరటి పండ్లతో నైవేద్యం పెట్టిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. గత కొంత కాలంగా క్యోటోలోని పురాతన దేవాలయాల్లోని బుధ్ధ విగ్రహాలు మాయం కావడం ఒక మిస్టరీగా మారింది. అయితే ఏబ్ పట్టుబడటంతో కథ సుఖాంతమైంది.
News Posted: 4 March, 2009
|