త్వరలో డయాబెటిస్ వాక్సిన్
లండన్: పిల్లల్లో మధుమేహ మహమ్మారిని నివారించే వాక్సిన్ 20 ఏళ్లలో అందుబాటులోకి రాగలదని బ్రిటన్ శాస్త్రవేత్తలు తెలిపారు. మధుమేహ వ్యాధికి, ఒక వైరస్ కుటుంబానికి మధ్య లింకును ఆ శాస్త్రవేత్తల బృందం కనుగొనింది. టైప్ 1 డయాబెటిస్ రోగుల్లో 60 శాతం మందికి పైగా ఇన్పెక్షన్ ఆనవాళ్లను బ్రిటన్ శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. అయితే అందుకు కారణమైన వైరస్ లను గుర్తించేందుకు కొంత సమయం పడుతుందని ఆ బృందం తెలిపింది. వైరస్ ను గుర్తించినట్లయితే దానికి విరుగుడుగా వాక్సిన్ ను కనుగొనడం సులభమని ఆ బృందం 'డయాబెటాల్జియా' జర్నల్ లో వెల్లడించింది.
బీటా సెల్స్ ఎంటెరోవైరల్ ఇన్ ఫెక్షన్కు, టైప్ 1 డయాబెటిస్ వ్యాధి రావడానికి మధ్య లింకును తొలిసారిగా కనుగొన్నామని పెనిన్సులా మెడికల్ స్కూల్ శాస్త్రవేత్త నోయల మోర్గాన్ తెలిపారు. అయితే పరిశోధన మరో దశలో ఏ ఎంటెరోవైరస్ వల్ల బీటా సెల్స్ లో ఇలాంటి మార్పులు చోటు చేసుకుంటున్న విషయం వెలుగు చూసే అవకాశముంది. ఆ విషయం వెలుగు లోకి రాగానే అందుకు వాక్సిన్ కనుగొనడం చాల సులభమని మోర్గాన్ తెలిపారు. ఈ వాక్సిన్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా టైప్ 1, టైప్ 2 మధుమేహ వ్యాదిగ్రస్తులకు విముక్తి లభించగలదని మోర్గాన్ తెలిపారు.
News Posted: 6 March, 2009
|