కేరళలో యాపిల్ తోటలు?
సిమ్లా : శీతల ప్రాంత పండు యాపిల్ ను ఉష్ణ ప్రదేశాలలో కూడా పండించవచ్చు. ఉష్ణ మండలమైన ఇండోనీషియాలోని జావాలో ఒక రైతు విజయవంతంగా ఏపిల్ తోటలు పెంచడాన్ని గమనించిన హిమాచల్ ప్రదేశ్ లోని మండి ప్రాంతానికి చెందిన ఉద్యానవన సైంటిస్ట్ డాక్టర్ చరణ్ జిత్ పర్మార్ ఇండియాలో తమిళనాడు, కేరళ వంటి ఉష్ణ ప్రదేశాలలో కూడా అదే పని చేయవచ్చునని భావిస్తున్నారు. ఇటీవల ఇండోనీషియాను సందర్శించిన పర్మార్ 'దేశంలో యాపిల్ తోటల పెంపకాన్ని ఇది విప్లవాత్మకం చేయగలదు' అని అన్నారు.
వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్ అయిన ఇండోనీషియా రైతు జె. క్రిబ్బెన్ యాపిల్ మొక్కల సహజ ప్రవర్తనను మార్చే ఒక పద్ధతిని కనుగొన్నట్లు పర్మార్ తెలిపారు. కోతల తరువాత యాపిల్ రైతులు ఆకులను తొలగిస్తారు. ఈ పనిని చాలా వరకు చేతులతోనే చేస్తారు. '60 రోజుల తరువాత చెట్టు తిరిగి చిగుర్చి పుష్పించనారంభిస్తుంది. తదుపరి పంట నాలుగు మాసాల అనంతరం సిద్ధం అవుతుంది. ఏడాది పొడుగునా చెట్లు పెరుగుతుంటాయి. పెరుగుదల ఆగిపోయే దశ అంటూ ఏదీ ఉండదు' అని పర్మార్ తెలియజేశారు. ఉష్ణ వాతావరణంలో భూమధ్య రేఖకు దక్షిణంగా ఆరు డిగ్రీల వద్ద జావా ఉంది. అక్కడ శీతాకాలమనేదే ఉండదు. కనీస ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్ కు తగ్గదు. అంటే యాపిల్ తోటలకు శీత గాలులు తగలవన్నమాట.
News Posted: 11 March, 2009
|