బేరానికి బిలియనీర్ల ఆస్తులు
న్యూయార్క్: ప్రపంచ ఆర్ధిక సంక్షోభం ప్రపంచ బిలియనీర్ల జేబులకు చిల్లు చేసింది. దాంతో ఆశపడి కొనుగోలు చేసిన ఖరీదైన, విలాస వస్తువులను వారు తెగనమ్ముకుంటున్నారు. భవంతులను, విలాసవంతమైన పడవలను, ప్రైవేట్ జెట్ లను, చివరికి సాకర్ టీమ్ లను సైతం అమ్మకానికి పెట్టారు. ఫోర్బ్స్ ప్రపంచ సంపన్నుల జాబితా బక్కచిక్కింది. గత ఏడాది 1,125 మందిగా ఉన్న ప్రపంచ బిలియనీర్లు ఈ ఏడాది 793 మందికి చేరారు. ఏడాది లోపు ప్రపంచ బిలియనీర్లు కోల్పోయిన సంపద 2 ట్రిలియన్లుగా ఫోర్బ్స్ ప్రకటించింది. అదే సమయంలో ఈ బిలియనీర్లు మురిపెంగా చూసుకునే పలు వస్తువులు అమ్మకానికి సిద్దమైనట్లు ఫోర్బ్స్ మరో నివేదిక తెలిపింది.
పెద్ద కోట లాంటి భవంతులు, విలాసవంతమైన హోటల్, ప్రైవేట్ జెట్ లు, చివరికి సాకర్ టీమ్, పెద్ద సైజు పడవలు సైతం అమ్మకానికి వచ్చినట్లు ఆ నివేదిక పేర్కొంది. రష్యా మార్కెట్ కుప్పకూలడంతో గత ఏడాది ప్రపంచ సంపన్నుల జాబితాలో నిలిచిన సెర్జీ పొలొన్స్కీ ప్రస్తుతం తన వ్యాపారాన్ని నడిపేందుకు కావలసిన నిధుల వేటలో ఉన్నారని ఆ నివేదిక తెలిపింది. ప్రముఖ హోటల్ 'సన్ గేట్ పోర్ట్ రాయల్'ను, పడవల్ని, సిడిఈ డి అజుర్ పైగల ఇంటిని అమ్మివేయనున్నట్లు పొలొన్స్కీ ప్రకటించారు.
దాంతోపాటు మార్కెట్ లో పలు పడవలు, సముద్రతీర భవంతులు అమ్మకానికి సిద్దంగా ఉన్నాయి. పలు బిలియనీర్లు, మాజీ బిలియనీర్లు, బిలియనీర్ల భార్యలు ప్రస్తుత సంక్షోభ కాలంలో తమ బిలియనీర్ జీవనశైలికి స్వస్తి చెప్పే క్రమంలో ఇలాంటి విలాసవంతమైన ఆస్తులన్నటిని వదిలించుకోవాలని చూస్తున్నారు. ఫ్రెంచ్ కాసిల్, చతావు డి ఫార్చ్ విల్లీని 57 మిలియన్ అమెరికన్ డాలర్లు అమ్మివేసినట్లు ఫోర్బ్స్ నివేదిక తెలిపింది.
News Posted: 13 March, 2009
|