అంతరిక్షంలో సరికొత్త జీవులు
హైదరాబాద్: భూమి మీద లేని, అల్ట్రావైలెట్ రేడియేషన్ ను తట్టుకోగల సరికొత్త బ్యాక్టీరియాలను భూమి ఉపరితలానికి దూరంగా స్ట్రాటోస్పియర్ పై భాగాన ఇస్రో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రముక ఖగోళ శాస్త్రవేత్త ఫ్రెడ్ హొయలె పేరు మీద జానీబ్యాక్టర్ హొయలే (పివిఏఎస్-1)అని పేరు పెట్టారు. రెండవ రకం బ్యాక్టీరియాకు బాసిల్లస్ ఇస్రోనెన్సిస్ (బి3 డబ్ల్యూ22) అని ఇస్రో పేరు కలసి వచ్చేట్లు పేరు పెట్టారు. భారత ప్రసిద్ధ శాస్త్రవేత్త ఆర్యభట పేరుమీద బాసిలస్ ఆర్యభట (బి8డబ్ల్యూ22) అని మూడవ రకం బ్యాక్టీరియాకు పేరు పెట్టారు. భారత తొలి కృత్రిమ ఉపగ్రహానికి కూడా ఆర్యభట అని పేరు పెట్టిన విషయం తెలిసిందే.
టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టిఐఎఫ్ ఆర్) హైదరాబాద్ లో నిర్వహిస్తున్న జాతీయ బెలూన్ కేంద్రం నుండి 459 కెజిల పేలోడ్ ను తీసుకెళ్లే 26.7 మిలియన్ ఘనపు అడుగుల బెలూన్ ను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించారు. పేలోడ్ ను 38 కెజిల లిక్విడ్ నియాన్ లో ఉంచారు. ఈ పేలోడ్ లో ఒక క్రయోసాంప్లిర్ ఉంది. ఇందులో దాదాపు 16 గాలి చొరబడని, స్టెయిన్ లెస్ స్టీట్ ప్రోబ్స్ ను అమర్చారు. బెలూన్ ప్రయాణించినంత సేపు ఈ ప్రోబ్స్ ను ద్రవ నియాన్ లో ముంచి ఉంచుతారు. దీని ద్వారా 'క్రయోపంప్ ఎఫెక్ట్'ను సృష్టిస్తారు. భూమికి 20-41 కిలోమీటర్ల దూరంలోని భూ వాతావరణంలోని భిన్న ఎత్తుల్లో గాలిని ప్రయోగాల కోసం సేకరించారు. ఆ తర్వాత పే లోడ్ ను జాగ్రత్తగా నేలకు దించి సేకరించిన గాలిలోని జీవుల ఉనికిని శాస్త్రవేత్తలు పరీక్షించారు.
ఈ పరిశోధనల్లో 12 బ్యాక్టీరియల్, ఆరు ఫంగల్ సమూహాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వాటిలో ఆరు '16 ఆర్ఎన్ఏ జన్యు నిర్మాణంతో' ఉన్నాయి. భూమి మీద దొరకే ఇలాంటి జీవులతో 98 శాతం సారూప్యతలో ఉన్నాయి. పివిఏఎస్-1, బి3 డబ్ల్యూ 22, బి8 డబ్ల్యూ 22 అని పిలిచే మూడు బ్యాక్టీరియా సమూహాలు ఇదివరకెన్నడూ భూ వాతావపరణంలో కనుగొనడం జరుగ లేదని ఇస్రో ప్రతినిధి తెలిపారు. పుణె విశ్వవిద్యాలయ అస్ట్రోఫిజిక్స్ అస్ట్రానమీ ప్రొఫెసర్ జయంత్ నర్లీకర్ ఈ ప్రయోగాన్ని పరిశీలించారు. సుప్రసిద్ద శాస్త్రవేత్తలు యుఆర్ రావు, అన్వేషణకు చెందిన పిఎమ్ భార్గవలు ఈ ప్రయోగానికి ప్రధాన మార్గదర్శకులుగా పనిచేశారు. సిసిఎమ్ బి నుండి ఎస్ శివాజీ, ఎన్ సిసిఎస్ నుండి యోగేష్ షౌచే జీవశాస్త్ర నిపుణులు, టిఐఎఫ్ఆర్ బెలూన్ కేంద్ర నిర్దేశకులు రవి మాన్ చందా, ఇస్రో డైరెక్టర్ సిబిఎస్ దత్ లు ఈ ప్రయోగ పరిశీలకులుగా హాజరైనారు.
News Posted: 17 March, 2009
|