ప్రేమకు 8 సెకన్లు చాలు!
లండన్: తొలి చూపులోనే ప్రేమలో పడటమన్న నానుడిని ఒక తాజా అధ్యయనం శాస్త్రీయంగా ధృవీకరించింది. ప్రేమలో పడేందుకు 8.2 సెకన్ల చూపుల కలిసే సమయం చాలని ఆ అధ్యయనం వెల్లడించింది. 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్'కు ఆ సమయం సరిపోతుందని, అయితే ప్రేమలో పడే సమయం ఆడవాళ్లపై ఆధారపడి ఉంటుందని ఆ అధ్యయనం తెలిపింది. స్త్రీ-పురుషులు తొలిసారి కలసినపుడు పురుషులు ఎక్కువగా స్త్రీలను గమనిస్తుంటే అతనికి ఆమె పట్ల ఆకర్షణ ఎక్కువగా ఉన్నట్లు లెక్క.
స్త్రీ-పురుషులు తొలి కలయిక జరిగిన 4 సెకన్లలోపు ఒక వ్యక్తిలో ఎలాంటి ఆసక్తి కలిగేందుకు అవకాశం లేదు. అయితే 8.2 సెకన్ల తర్వాత కూడా ఆ వ్యక్తిలో ఎలాంటి మార్పు రాకుండా ఉంటే, సదరు వ్యక్తి అప్పటికే ప్రేమలో పడినట్లు లెక్క. మగవాళ్ల విషయంలో ఈ లెక్కలు సరిపోతాయే గాని, ఆడవాళ్ల విషయంలో ఈ లెక్కలు పనికిరావు. కొత్తగా పరిచయమైన మగవాడు ఆకర్షణీయంగా ఉన్నడా లేదా అన్న విషయాన్ని చూపులతోనే పైన చెప్పిన 8.2 సెకన్ల సమయంలో ఆడవాళ్లు గమనించేందుకు ప్రయత్నిస్తారని ప్రముఖ బ్రిటిష్ దిన పత్రిక 'ది డైలీ టెలిగ్రాఫ్' వెల్లడించింది.
ఆడవాళ్ల చూపులతో చూపులు కలిపేందుకు మగవాళ్లు ఎక్కువగా ప్రయత్నిస్తారని, ఆడవారు మాత్రం అనైతికంగా గర్భధారణ, సింగిల్ పెరెంట్ హుడ్ (తల్లి లేక తండ్రి మాత్రమే ఉండే స్థితి) పట్ల గల భయాల కారణంగా ఆకర్షితులు కాకుండా తప్పుకుంటారని పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనం కోసం పరిశోధకులు దాదాపు 115 మంది విద్యార్ధులను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన వారి చూపులను గుర్తించేందుకు రహస్య కెమరాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వారి ప్రత్యర్ధుల సంభాషణలోని ఆకర్షణ వివరాలను సదరు విద్యార్ధుల నుండి సేకరించారు.ఎంపిక చేసినవారిలోని ఆడవాళ్ల కళ్లలోకి సూటిగా చూస్తూ మాట్లాడే మగవాళ్లు 8.2 సెకన్ల కాలపరిమితిలో తాము మాట్లాడుతున్న ఆడవాళ్లను ఆకర్షణీయంగా ఉన్నారని గుర్తించినట్లు తెలిపారు. అయితే తాము సంభాషిస్తున్న ఆడవారి పట్ల విముఖతను వ్యక్తం చేసేందుకు కేవలం 4.5 సెకన్ల కాలం సరిపోయినట్లు పరిశోధకులు గుర్తించారు. అలాగే ఆడవారు కూడా అదే సమయంలో ఆకర్షితులైనారని 'ఆర్చీవ్స్ ఆఫ్ సెక్యువల్ బిహేవియరల్' జర్నల్ పేర్కొంది.
News Posted: 25 March, 2009
|