అపర విక్రమార్కుడు
లక్నో : అతనిని అపర విక్రమార్కుడనవచ్చు. అతను 80 సంవత్సరాల రిక్షా పుల్లర్. పేరు జగ్ లాల్. అతను ఇంత వరకు 22 సార్లు ఎన్నికలలో పోటీ చేశాడు. ఓడిపోయాడు. అయినా అతనిలో ఉత్సాహం అంతరించలేదు. ఉత్తర ప్రదేశ్ ఫతేపూర్ జిల్లా నుంచి మరొక దఫా ఎన్నికలలో పోటీ చేయాలని జగ్ లాల్ సంకల్పించాడు.
'నేను గెలిచినా లేక ఓడినా స్వతంత్ర అభ్యర్థిగా లోక్ సభ ఎన్నికలలో పోటీ చేయడం మాత్రం ఖాయం' అని జగ్ లాల్ 'పిటిఐ' విలేఖరితో చెప్పాడు. తాను ఇప్పటి వరకు వివిధ ఎన్నికలలో 22 పర్యాయాలు పోటీ చేసినట్లు అతను వెల్లడించాడు. 'నేను పట్టణ స్థానిక సంస్థ చైర్ పర్సన్ పదవికి ఐదు సార్లు, శాసనసభ ఎన్నికలలో ఎనిమిది సార్లు, లోక్ సభ ఎన్నికలలో తొమ్మిది సార్లు పోటీ చేశాను. నేను పోటీ చేయడం ఇది 23వ పర్యాయం' అని అతను చెప్పాడు.
ఎన్నికలలో పాల్గొనడానికి ఏది పురికొల్పిందనే ప్రశ్నకు జగ్ లాల్ సమాధానం ఇస్తూ, 'వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు జిల్లా కోసం చేసింది శూన్యం. నేను పుట్టింది, జీవితం అంతా గడిపిందీ ఈ జిల్లాలోనే. అందువల్ల నా సోదరుల కోసం ఏదైనా చేయడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను' అని చెప్పాడు.
తన 'సొంత వారికి' సేవ చేసే లక్ష్యంతో జగ్ లాల్ మొదటిసారి ఖగా అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ మాజీ ఎంఎల్ఎ కృష్ణ దత్ పై పోటీ చేశాడు. అయితే, అది ఏ సంవత్సరమో అతను గుర్తుకు తెచ్చుకోలేకపోయాడు.
News Posted: 27 March, 2009
|